జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills Bypoll ) నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. ఈ ఆంక్షలు టెలివిజన్, రేడియో, పత్రికలు, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో సహా అన్ని సమాచార మాధ్యమాలపైనా సమానంగా అమలులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఎన్నికల రోజున ప్రజాభిప్రాయ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ లేదా ఏదైనా రకమైన రాజకీయ ప్రచారం ప్రచురించడం, ప్రసారం చేయడం చట్టపరంగా నిషేధమని స్పష్టంచేశారు.
Konda Surekha OSD : కొండా సురేఖ ఓఎస్టీ తొలగింపు
ఎన్నికల నియమావళి ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఈ నిషేధం విధించబడిందని అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా సాగేందుకు ఈ చర్య అవసరమని వారు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టం ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు. ఎగ్జిట్ పోల్స్ నిషేధం అమలులో ఉన్న సమయంలో ఎలాంటి ఫలితాలు, అంచనాలు లేదా సర్వేలు ప్రచురించకుండా మీడియా సంస్థలు జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల రోజున ప్రశాంతంగా ఓటింగ్ జరగేందుకు పోలీసులు, ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఈ ఆంక్షల వల్ల ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగి, ప్రజల ఓటు హక్కు ప్రభావితం కాకుండా రక్షించబడుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా, సోషల్ మీడియా వినియోగదారులు చట్టానికి అనుగుణంగా ప్రవర్తించాలని సూచనలు జారీ చేశారు.