Telangana: జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణలో రూ.9,000 కోట్ల పెట్టుబడితో పంప్‌డ్ స్టోరేజీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిపాదిత పంప్‌డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ 1,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ మధ్య దీనికి సంబంధించి అవగాహన ఒప్పందం కుదిరింది.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశంలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను ప్రకటించారు.
జేఎస్‌డబ్ల్యూ(జస్వ) ఎనర్జీ అనేది థర్మల్, హైడ్రో మరియు సౌర వనరుల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ విద్యుత్ సంస్థగా ఇది 4,559 మెగావాట్ల కార్యాచరణ సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు దేశంలో అతిపెద్ద స్వతంత్ర జల విద్యుత్ ఉత్పత్తిదారు కూడా.
పంప్‌డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌కు అవసరమైన అన్ని సహాయ సహకారాలను జేఎస్‌డబ్ల్యూకి అందజేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ దిశగా రాష్ట్రానికి జేఎస్‌డబ్ల్యూ కీలక భాగస్వామి అని, భారతదేశంలో తమ భవిష్యత్ ప్రాజెక్ట్‌ల కోసం జేఎస్‌డబ్ల్యూతో సహకరించేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
భారతదేశంలో జేఎస్‌డబ్ల్యూ వేగంగా విస్తరిస్తున్నదని మరియు రాష్ట్రంలో తన ఉనికిని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, ఐటీఈ అండ్ సీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also Read: Rama Mandiram : కాంగ్రెస్ నిర్ణయం కరెక్టేనా?