Jr NTR and Amit Shah: ‘షా’ గ్యారేజ్ లో జూనియర్

జూనియర్, అమిత్ షా డిన్నర్ వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఏకాంతంగా ఇద్దరు 20 నిమిషాలకు పైగా చర్చించుకున్నారని తెలిసింది.

  • Written By:
  • Updated On - August 21, 2022 / 11:44 PM IST

జూనియర్, అమిత్ షా డిన్నర్ వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఏకాంతంగా ఇద్దరు 20 నిమిషాలకు పైగా చర్చించుకున్నారని తెలిసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోవాటెల్ హోటల్ వద్ద జూనియర్ ని రిసీవ్ చేసుకొని అమిత్ షా రూంకి తీసుకెళ్లారు.

ఆ తరువాత ఏకాంతంగా షా, జూనియర్ మాట్లాడుకున్నారు. షెడ్యూల్ కంటే గంటన్నర లేట్ గా వాళ్ళిద్దరి భేటీ జరిగింది. కోమరంభీం వేషంలో జూనియర్ నటన నచ్చినందున షా భేటీ కావాలని అనుకున్నారని బీజేపీ చెబుతుంది. అదే నిజం అయితే, త్రిబుల్ ఆర్ సినిమాలో జూనియర్ కు తగ్గకుండా నటించిన రాంచరణ్ ను కూడా డిన్నర్ కు పిలవాలి. అంతే కాదు , టాప్ డైరెక్టర్ రాజమౌళిని కూడా ఆహ్వానించాలి. ఆస్కార్ కు త్రిబుల్ ఆర్ సినిమాను ఎంపిక జరుగుతుంది. అందుకే జూనియర్ ను డిన్నర్ కు పిలిచారని రూమర్ వచ్చింది. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఎందుకంటే సినిమా హీరో మాత్రమే ఆయన మిగిలిన వాళ్ళు లేకుండా ఆ సినిమాను ఆస్కార్ కు ఎంపికపై చర్చించే ఛాన్స్ లేదు. త్రిబుల్ ఆర్ చూసి ఎన్టీఆర్ ను డిన్నర్ కి ఆహ్వానించారు అనేది నమ్మశక్యంగా లేదు. ఇక రెండో ఆప్షన్ రాజకీయాలు.

చంద్రబాబుతో దూరంగా ఉంటున్న జూనియర్ ను బీజేపీ కి నాయకత్వం వహించేలా ఏపీ, తెలంగాణ లో ఉపయోగించుకోవాలని షా భావించి ఉండొచ్చు. కర్ణాటక బీజేపీ లీడర్లు ఒకరిద్దరు జూనియర్ కు బాగా క్లోజ్ గా ఉంటారు. వచ్చే ఎన్నికల నాటికి జూనియర్ ప్రచారాన్ని వాళ్ళు కోరుకుంటున్నారని తెలుస్తుంది. అందుకే , త్రిబుల్ ఆర్ ద్వారా క్రేజ్ లో ఉన్న జూనియర్ ని స్టార్ కంపైనేర్ గా ఉపయోగించుకోవాలని బీజేపీ ఎత్తుగడగా ఉందని టాక్.

కానీ, తాత పెట్టిన టీడీపీని కాదని బీజేపీలోకి వెళ్లే అంత ఆలోచన జూనియర్ చేయడానికి అవకాశం లేదు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పుడు లేదని సన్నిహితులు చెబుతున్నారు. కాబట్టి షా ప్రయత్నం ఫలించదు. కేవలం షా టూర్లో జూనియర్ భేటీ కొన్ని రోజులు ప్రచారం కోసం పనికి వస్తుంది. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. పరోక్షంగా స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానులను బీజేపీ తమ వైపు తిప్పుకోవడానికి డిన్నర్ భేటీ మలుపు అనుకోవచ్చు. ఎందుకంటే, ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కోసం టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ మంత్రులు ఇటీవల ఘాట్ వద్ద క్యూ కట్టారు. ఇక మూడో ఆప్షన్ తమిళనాడులో జయలలిత మరణం తరువాత ఆడిన గేమ్ ను చంద్రబాబు ఉండగానే జూనియర్ రూపంలో టీడీపీని వాడుకోవాలని షా స్కెచ్ వేసి ఉంటారని టాక్. కానీ, అదీ అంత ఈజీ కాదు. అయితే,
రామోజీ ఫిలింసిటీలో 45 నిమిషాలు అమిత్ షా , రామోజీరావు భేటీ కొన్ని రాజకీయ పెను మార్పులకు సంకేతాలు ఇస్తుంది.
ఇవన్నీ చూస్తే టీడీపీ, బీజేపీ దగ్గర అయ్యేలా కనిపిస్తుంది. కానీ, జూనియర్ తో షా విందులోని గుట్టు అధికారికంగా బయటకు వచ్చే ఛాన్స్ లేదు.
చంద్రబాబుకు ఇటీవల జూనియర్ దూరంగా ఉంటున్నారు. తెలంగాణ టీడీపీ ని ఆయన చేతుల్లో పెట్టడానికి చాలా సందర్భాల్లో బాబు ప్రయత్నం జరిగింది. కానీ , ఆయన వ్యూహం ఫలించలేదు. ఫిల్మ్ సిటీ కేంద్రంగా ఆ వ్యూహాన్ని షా ద్వారా రక్తికట్టించే ప్రయత్నం జరిగిందా? అంటే ఏమో రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఏపీలో పొత్తు తెలంగాణలో సహకారం దిశగా టీడీపీ ని ఉపయోగించుకోవాలని షా అండ్ టీం భావిస్తుందని టాక్. ఆ విషయం పక్కాగా ఫిల్మ్ సిటీ కేంద్రంగా చర్చ జరిగిందని వినికిడి. కేవలం బాబు మద్దతు వల్ల పెద్దగా తెలంగాణలో ఉపయోగం ఉండదని బీజేపీ అంచనా. అందుకే జూనియర్ ను రంగంలోకి దింపాలని షా కు కొందరు మాజీ టీడీపీ ప్రస్తుత బీజేపీ లీడర్లు సూచించారని సమాచారం. అదే జరిగితే అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ రెండు పార్టీలకు లాభంగా లెక్కిస్తున్నారు. జూనియర్ ద్వారా అనూహ్య మలుపు రెండు రాష్ట్రాల్లో తిప్పాలని బీజేపీ స్కెచ్. 2019 ఎన్నికల నుంచి చంద్రబాబు దూరం జరిగినప్పటికీ నందమూరి కుటుంబంతో బీజేపీ సంబంధాలు నెరుపుతుంది. ప్రస్తుతం పురంధరేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆమె ఇచ్చిన కొన్ని క్లూ ల ఆధారంగా జూనియర్ ను షా ఆహ్వానించారని టాక్.
ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలోకి జూనియర్ వెళతారా? మద్యే మార్గంగా నందమూరి కుటుంబానికి టీడీపీని దీర్ఘకాలంలో అప్పగించే ట్విస్ట్ షా? రామోజీ ఇస్తారా? అనేది పెద్ద ప్రశ్న. షా, రామోజీ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. మూడో వ్యక్తికి వాళ్ళిద్దరి సంభాషణ తెలిసే ఛాన్స్ లేదు. ఇక షా, జూనియర్ కూడా ముఖాముఖి మాట్లాడుకున్నారు. త్రిబుల్ ఆర్ సినిమాలోని జూనియర్ నటన గురించి అభినందించే డిన్నర్ మాత్రమే అంటూ బీజేపీ పరిమితం అవుతుంది. మొత్తం మీద షా, జూనియర్ భేటీ వయా రామోజీ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. దీనికి వాళ్ల ముగ్గురిలో ఒకరు బయటకు వచ్చి చెప్పే వరకు ఊహాగానాలు ఆగవు. పెను రాజకీయ మార్పులకు మాత్రం జూనియర్, షా, రామోజీ త్రయం భేటీలు బాటలు వేస్తాయని మాత్రం అంచనా వేయొచ్చు.