Koneru Konappa : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని సిర్పూర్ అసెంబ్లీ స్థానంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. సిర్పూర్‌లో పాగా వేసేందుకు ఎమ్మెల్సీ దండే విఠల్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో కోనేరు కోనప్ప చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచనాలకు దారి తీస్తున్నాయి. కోనప్ప ప్రస్తుతం ఎలాంటి పదవిలోనూ లేరు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పెద్దల నుంచి ఆయనకు పెద్దగా మద్దతు లభించడం లేదని అంటున్నారు. ఇక దండే విఠల్ ఎమ్మెల్సీగా ఉండటంతో, అధిష్టానం మద్దతును పొందగలుగుతున్నారు. కోనేరు కోనప్ప ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సిర్పూర్ అసెంబ్లీ స్థానానికి కొన్ని పనులకు సంబంధించి నిధులను మంజూరు చేయించుకున్నారు. ఇప్పుడు ఆ నిధులు, అభివృద్ధి పనులు రద్దయ్యాయి. ఈ అంశంపైనే కోనేరు కోనప్పకు కోపం వచ్చింది.
Also Read :Purandeswari: పురందేశ్వరికి ఢిల్లీ నుంచి పిలుపు.. ఏపీ బీజేపీలో ఏం జరగబోతోంది ?
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానన్న కోనప్ప
అందువల్లే ఇటీవల ఒక సభలో కోనేరు కోనప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా. నేను ఏ రాజకీయ నిర్ణయమైనా ప్రజల ముందే తీసుకుంటా. కేసీఆర్ దేవుడిలా వంతెన, రోడ్లు, అభివృద్ధి పనులు మంజూరు చేస్తే, వాటిని రద్దు చేశారు. ఈ ప్రభుత్వంలోని మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదు. నా వెంట ఉంటూ నన్నే ముంచిన ఘటాలు ఉన్నారు. గుడిపేట, వీర్ధండి బ్రిడ్జి నిర్మాణానికి ప్రజలు ఉద్యమం చేయాలి. పదవిలో ఉన్న నాయకులు మీ ఊరికి వస్తే నిలదీయండి’’ అని కోనప్ప చేసిన వ్యాఖ్యలు సిర్పూర్ అసెంబ్లీ స్థానం పరిధిలో కాంగ్రెస్‌లో ఏర్పడిన విభేదాలను ఎత్తిచూపాయి. ఇటీవలే కేస్లాపూర్ నాగోబా జాతర దర్శనానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి కోనేరు కోనప్ప వెళ్లారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రస్తుతం బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీకి దూరంగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సన్నిహితంగా మెలుగుతున్న కోనప్ప భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ఏమిటనేది స్పష్టంగా తేటతెల్లం అవుతోంది.
Also Read :Elon Musk Vs Indian Voters: భారత్‌లో ఓటింగ్.. నిధులు ఆపేసిన అమెరికా.. బీజేపీ సంచలన రియాక్షన్
కోనేరు కోనప్ప నేపథ్యం..
కోనేరు కోనప్ప(Koneru Konappa) 2004లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో బీఎస్పీ తరఫున గెలిచి, బీఆర్‌ఎస్‌లో చేరారు. అదే పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో కోనప్ప ఓడిపోయారు. అయితే ఆ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు 44,646 ఓట్లు వచ్చాయి. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఓట్లు చీల్చడం వల్లే ఓడిపోయానని కోనప్ప అప్పట్లో తెలిపారు. తనను ఓడించిన ప్రవీణ్ కుమార్‌ను బీఆర్ఎస్‌లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ , బీఆర్ఎస్ నుంచి కోనప్ప బయటికి వచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు.