Green India: జోగినపల్లి మరో అద్భుత కార్యక్రమం.. పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్‌ అరణ్య’ 

  • Written By:
  • Publish Date - May 2, 2024 / 04:57 PM IST

Green India: అస్సాలోని జోర్హట్‌ అటవిలో పదివేల మొక్కలు నాటే కార్యక్రమం మొదలు
గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ద్వారా మొక్కల పెంపకం, పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టిన రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతిప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహిత జాదవ్‌ పాయంగ్‌తో కల్సి అస్సాలో ‘వృక్ష వేద్‌ అరణ్య’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పచ్చని భవితకు బాటలు వేసేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు వృక్ష వేద్‌ అరణ్య ఉపయోగపడాలన్ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అస్సాంలోని జోర్హట్‌ అటవీ ప్రాంతంలోని అరుణాచల ద్వీపంలో మొలాయి కథోని అటవీ ప్రాంతంలో గురువారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వృక్ష వేద్‌ అరణ్యలో భాగంగా తాము పదివేల మొక్కలు నాటబోతున్నట్టు జాదవ్‌ పాయంగ్‌ వెల్లడించారు. అస్సాంలోని మొలాయి కథోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కో ఫౌండర్‌ కరుణాకర్‌ రెడ్డి, రితిరాజ్‌ పుకాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాదవ్‌ పాయంగ్‌ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు మనం అందించే అత్యంత విలువైన సంపద వృక్ష సంపదనే అని, వృక్షాలను కొట్టివేయకుండా పెంచాల్సిన అవసరం ఉన్నదన్నారు. వృక్షాలు కూడా మనుషులలాగే జీవాలని, అవి తాము బతుకుతూ.. మనకు బతుకును ఇస్తున్నాయని, వాటిని కాపాడుకోవడం ప్రతీ మనిషి బాధ్యత అన్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ద్వారా మాజీ ఎంపీ సంతోష్‌ కుమార్‌ పర్యావరణానికి చేస్తున్న కృషికి వెలకట్టలేమన్నారు. ప్రతీ ఒక్కరు మూడు మొక్కలు నాటాలంటూ సంతోష్‌ చేస్తున్న ప్రయత్నం విజయంతమైందని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు.

సంతోషం వ్యక్తం చేసిన సంతోష్‌..

ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహిత జాదవ్‌ పాయంగ్‌ వృక్ష వేద అరణ్య కార్యక్రమాన్ని మొదలు పెట్టడంపై మాజీ ఎంపీ, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ వ్యవస్థాపకులు జె.సంతోష్‌ కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు. చెట్లపై జాదవ్‌ పాయంగ్‌కు ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ కార్యక్రమం అని అభివర్ణించారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నంలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలని సంతోష్‌ పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన ట్విట్టర్‌(ఎక్స్‌) ద్వారా కార్యక్రమం ప్రారంభించిన వారికి అభినందనలు చెప్పారు..