Jharkhand Political Crisis : `విశ్వాస`పాత్రుడి మూడ్!

దేశ వ్యాప్తంగా బీజేపీ వేస్తోన్న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌ను చిత్తు చేయ‌డానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ త‌ర‌హాలో ఆయా రాష్ట్రాల బీజేపీయేత‌ర సీఎంలు విశ్వాస తీర్మానం అస్త్రాన్ని పెట్టుకున్నారు. తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ విశ్వాస తీర్మానంకు సిద్ధం అయ్యారు.

  • Written By:
  • Updated On - September 5, 2022 / 01:11 PM IST

దేశ వ్యాప్తంగా బీజేపీ వేస్తోన్న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌ను చిత్తు చేయ‌డానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ త‌ర‌హాలో ఆయా రాష్ట్రాల బీజేపీయేత‌ర సీఎంలు విశ్వాస తీర్మానం అస్త్రాన్ని పెట్టుకున్నారు. తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ విశ్వాస తీర్మానంకు సిద్ధం అయ్యారు. తెలంగాణ‌లోనూ అలాంటి ప‌రిస్థితి వ‌స్తుంద‌ని `ముంద‌స్తు`గా ఆలోచించిన కేసీఆర్ ఈడీ, సీబీఐ దాడులపై లీడ‌ర్ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. అంతేకాదు, రాష్ట్రంలోకి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఎంట్రీ ఇవ్వ‌కుండా గ‌తంలో చంద్ర‌బాబు చేసిన మాదిరిగా చేయాల‌నే ఆలోచ‌న కూడా చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకోసం సెప్టెంబ‌ర్ 6న జ‌రిగే అసెంబ్లీ వేదిక‌గా కొన్ని సంకేతాలు ఇచ్చే అవ‌కాశం లేక‌పోలేదు.

క‌నీసం 40 మంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నార‌ని బీజేపీ తొలి నుంచి చెబుతోంది. వాళ్లంద‌రూ బీజేపీలోకి రావ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ప‌లు సంద‌ర్బాల్లో ప్ర‌స్తావించారు. అంతేకాదు, చేరిక‌ల క‌మిటీకి ఈటెల‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి లాంటి సీనియ‌ర్లను నియ‌మించిన బీజేపీ బిగ్ ఆప‌రేష‌న్ చేయ‌డానికి క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న చేస్తోంది. ఏ రోజైనా కేసీఆర్ జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మంటూ క‌మ‌ల‌నాథులు ప‌దేప‌దే చెబుతున్నారు. అక్ర‌మాలు, అవినీతికి సంబంధించిన ఆధారాల‌ను కేంద్రానికి అంద‌చేశామ‌ని కేసీఆర్ అరెస్ట్ అనివార్య‌మ‌ని అనేక సార్లు చెప్పారు. ట‌చ్ చేసి చూడండ‌ని ప్ర‌తిగా కేసీఆర్ ఛాలెంజ్ విసిరిన విష‌యం విదితమే. అయితే, తాజాగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్, జార్ఖండ్ సీఎంపై ఈడీ, ఐటీ , సీబీఐ దాడులు, మ‌హారాష్ట్ర త‌దిత‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన కేసీఆర్ స‌హ‌చ‌రుల‌కు జాగ్ర‌త్త‌లు చెప్పారు.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు 2018 ఎన్నిక‌ల‌కు వెళ్లే ముందు తెలంగాణ‌లో ఉన్న‌వే ఇప్పుడు క‌నిపిస్తున్నాయి. ఆనాడు విప‌క్షాల ఆరోప‌ణ‌ల‌ను భ‌రించ‌లేక ప్ర‌జా విశ్వాసం కోసం ముంద‌స్తుకు వెళుతున్నానంటూ కేసీఆర్ అసెంబ్లీని ర‌ద్దు చేశారు. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణ‌యం అసెంబ్లీ స‌మావేశాల్లో తీసుకుంటార‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఒక వేళ ర‌ద్దు చేయ‌క‌పోతే, విశ్వాసం తీర్మానం కోసం కేసీఆర్ కూడా వెళ్లే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని బీజేపీ అంచ‌నా వేస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ముంద‌స్తుకు వెళ్లాల‌ని కేసీఆర్ నిర్ణ‌యం తీసుకుంటే, గ‌వ‌ర్న‌ర్ పాల‌న కొంత కాలం పాటు న‌డిపే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇచ్చే డైరెక్ష‌న్ మేర‌కు నిర్ణ‌యం ఉంటుంది. ప్ర‌స్తుతం జార్ఖండ్ సీఎం హేమంత్ ఎమ్మెల్మే ప‌ద‌వికి అన‌ర్హ‌డంటూ ఎన్నిక‌ల క‌మిష‌న్ సిఫార‌స్సు చేసింది. ఆ క్ర‌మంలో ఆయ‌న విశ్వాస ప‌రీక్ష‌కు వెళ్లాడు.

అక్రమ మైనింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయడంపై జార్ఖండ్ గవర్నర్ రమేష్ బాయిస్‌కు ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని పంపి వారం రోజులైంది. అయితే గవర్నర్ మౌనంగా ఉండటం రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి కారణం కూడా కావచ్చు. ఊహాగానాల మధ్య, రాయ్‌పూర్‌కు వెళ్లిన మొత్తం 33 మంది ఎమ్మెల్యేలు రాంచీకి తిరిగి వచ్చారు. సోమ‌వారం జరగనున్న ప్రత్యేక సెషన్ వరకు సర్క్యూట్ హౌస్‌లో ఉంటారు. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ నేడు విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు.

సేమ్ టూ సేమ్ గ‌త వారం ఢిల్లీ అసెంబ్లీలోనూ అదే జ‌రిగింది. డిప్యూటీ సీఎం సిసోడియా పై సీబీఐ విచార‌ణ చేయ‌డంతో పాటు ఆప్ కు సంబంధించిన వాళ్ల ఇళ్లు, ఆఫీస్ ల‌ను సీబీఐ త‌నిఖీల‌ను చేసింది. ఆ హ‌డావుడిని గ‌మ‌నించిన కేజ్రీవాల్ విశ్వాస తీర్మానం ద్వారా అల‌జ‌డికి బ్రేక్ వేయ‌గ‌లిగారు. ఇలాంటి ప‌ద్ద‌తిని హేమంత్ సొరెన్ జార్ఖండ్ లో అమ‌లు చేస్తున్నారు. స్కామ్ ల‌ను బ‌య‌ట‌కు తీస్తే, బ‌హుశా కేసీఆర్ కూడా విశ్వాసం లేదా ముంద‌స్తు వైపు అడుగులు వేసే అవ‌కాశం లేక‌పోలేదు.