మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు, సినీ నటి జయప్రద ఆసక్తికర విషయాన్నీ వెల్లడించారు. తాను తెలుగు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని జయప్రద తన ఆసక్తిని తెలియచేసారు. తెలుగు బిడ్డగా ఏపీకి కానీ, తెలంగాణకు కానీ రావాలని తాను కోరుకుంటున్నట్లు జయప్రద చెప్పారు. ఇక్కడ ఉండి పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకోవాలనుకుంటున్నానని, అయితే ఈ విషయంలో నిర్ణయం పార్టీ పెద్దలదేనని ఆమె తెలిపారు.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో ఉండటం కంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండటానికే తాను ప్రాధాన్యతను ఇస్తానని జయప్రద తెలిపారు. ప్రస్తుతం తాను ఉత్తరప్రదేశ్ క్యాడర్ లో ఉన్నానని తనని ఎక్కడకి పంపాలనే నిర్ణయం పార్టీ అగ్రనేతలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని అయితే తనకి మాత్రం ఈసారి తెలుగు రాజకీయాల్లోకి రావాలని ఉన్నట్లు ఆమె తెలిపారు.
జయప్రద ఆసక్తిపై బీజేపీ నేతలు ఆలోచించే చాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రంలోని కమలనాధులు తెలంగాణపై ఫోకస్ చేస్తున్నారు. సౌత్ ఇండియాలో పాగా వేయడానికి తెలంగాణ అనువైన ప్రాంతమని భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని ఇలాంటి సమయంలో జయప్రదను తెలంగాణ రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేస్తే తన చరిష్మ తెలంగాణ బీజేపీకి ఉపయోగపడే అవకాశముందని రాష్ట్ర కమలం నేతలు భావిస్తున్నారు. మరి జాతీయ బీజేపీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.