Site icon HashtagU Telugu

Telangana Anthem : ఇక పై పాఠ్యపుస్తకాల్లో “జయ జయహే తెలంగాణ”: విద్యాశాఖ ఆదేశాలు

"Jaya Jayahe Telangana" in textbooks

"Jaya Jayahe Telangana" in textbooks

Telangana Anthem : ఈసారి నుండి తెలంగాణ ప్రభుత్వం ప్రచురించే పాఠశాల పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ గీతాన్ని చేర్చనున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి(2025-26) ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విభాగానికి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర గేయాన్ని పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి చెప్పారు.

కాగా, పాత సిలబస్‌తోనే వచ్చే విద్య సంవత్సరం కూడా పుస్తకాలను రెండు భాషల్లోనే ముద్రించనున్నారు. 2026-27 విద్య సంవత్సరం మాత్రం సిలబస్ మారుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈసారి పుస్తకాల్లో ఎలాంటి తప్పులు లేకుండా సరఫరా చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విద్యావేత్తల నుంచి సూచనలు, సలహాలు తీసుకోనున్నట్లు తెలిపారు. పిల్లలకు పుస్తకాలు ఎక్కువ బరువు కాకూడదనే తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణ రచయిత అందెశ్రీ రాసిన గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరం సమకూర్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చనున్నారు.

ఇకపోతే.. ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగేళ్ల క్రితం ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయతే ఈసారి మాత్రం పాత సిలబస్‌నే కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్ విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తెలుగు-ఇంగ్లీష్, హిందీ-ఇంగ్లీష్, ఉర్దూ-ఇంగ్లీష్ ఇలా రెండేసి భాషల్లో పుస్తకాలను ముద్రిస్తున్నారు. పిల్లలకు పుస్తకాల బరువు పెరుగుతోందని భావించి.. భాషేతర పుస్తకాలను రెండు భాగాలుగా చేసి విద్యార్థులకు అందిస్తున్నారు.

Read Also: Railway Amendment Bill : రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం