. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెర
. సంస్థాగత బలోపేతమే ప్రధాన లక్ష్యం
. త్వరలో కార్యాచరణ ప్రకటించనున్న పార్టీ
Janasena Party : తెలంగాణ రాజకీయ రంగంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమైన జనసేన తెలంగాణలోనూ సంస్థాగతంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ సాధ్యమైనన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులను బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా పార్టీని నిలబెట్టడం ప్రధాన లక్ష్యంగా ఈ అడుగు వేసినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలే ప్రజలతో నేరుగా మమేకమయ్యే వేదిక కావడంతో మున్సిపల్ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని పార్టీ భావిస్తోంది.
తెలంగాణలో జనసేనకు ఇప్పటివరకు పరిమిత స్థాయిలోనే నిర్మాణం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా పార్టీని గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు విస్తరించాలనే యోచనలో ఉంది. పార్టీ నాయకత్వం స్పష్టంగా చెబుతున్నది ఒక్కటే గెలుపు ఓటములకంటే కూడా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడమే ముఖ్యమని. అందుకే ప్రతి జనసైనికుడు, వీర మహిళ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఇంటింటి ప్రచారం, ప్రజా సమస్యలపై అవగాహన, స్థానిక అవసరాలపై చర్చలు వంటి కార్యక్రమాల ద్వారా పార్టీని ప్రజలకు చేరువ చేయాలని నిర్ణయించింది. ఈ ఎన్నికల ద్వారా తెలంగాణలో ఒక కొత్త రాజకీయ వేదికకు పునాది వేయాలన్నది జనసేన ఆలోచనగా కనిపిస్తోంది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో త్వరలోనే సమగ్ర కార్యాచరణను ప్రకటిస్తామని జనసేన నేతలు తెలిపారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం, స్థానిక సమస్యలపై మేనిఫెస్టో వంటి అంశాలపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పార్టీ భావిస్తోంది. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారమే ఎన్నికల ప్రచారానికి కేంద్ర బిందువుగా ఉండనున్నాయని సమాచారం. తెలంగాణ ప్రజలు కూడా ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్న తరుణంలో జనసేన తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఉనికిని బలంగా చాటే ప్రయత్నంగా ఈ మున్సిపల్ ఎన్నికలను పార్టీ వినియోగించుకోవాలని చూస్తోంది.
