తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) తో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి (Janareddy భేటీ అయ్యారు. ఈ భేటీలో మావోయిస్టు(Maoist)లతో శాంతి చర్చలు జరిపే అంశం, కాల్పుల విరమణ వంటి కీలక విషయాలపై వారు సమాలోచన నిర్వహించారు. శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తి మేరకు ఈ భేటీ జరిగింది. జానారెడ్డి సలహాలు, సూచనల ఆధారంగా మావోయిస్టుల సమస్య పరిష్కారానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనే దిశగా సీఎం చర్చలు కొనసాగిస్తున్నారు.
మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపేలా చొరవ చూపాలని, కాల్పుల విరమణకు ప్రయత్నించాలన్నదే వారి ప్రధాన విజ్ఞప్తి. జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ వంటి ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. జానారెడ్డి సలహాలతో ముందడుగు వేయాలని భావించారు. ఈ నిర్ణయంతో మావోయిస్టులతో శాంతి చర్చల ప్రక్రియ కొత్త దిశలో సాగే అవకాశం కనిపిస్తోంది.
ఇక మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకిస్తూ మావోయిస్టులతో చర్చలు జరిపే అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టల్లో భద్రతా దళాలు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో భారీ బంకర్‌ను గుర్తించడం మావోయిస్టుల వ్యూహాత్మక స్థితిని బయటపెట్టింది. వెయ్యిమంది మావోయిస్టులు ఆశ్రయించగలిగే ఈ గుహను గుర్తించిన భద్రతా దళాలు, పరిస్థితిని సవాళ్లతో ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ శాంతి చర్చల వేదికపై సమస్య పరిష్కరించాలని తెలంగాణ నేతలు కోరుతూ స్పష్టం చేస్తున్నారు.