Jagtial MLA: బీఆర్ఎస్‌కు మ‌రో బిగ్ షాక్‌.. కాంగ్రెస్‌లోకి జగిత్యాల ఎమ్మెల్యే

  • Written By:
  • Updated On - June 24, 2024 / 10:12 AM IST

Jagtial MLA: తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. మొన్న‌టి వర‌కు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న‌వారు తాజాగా కారు దిగి అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కొద్దిరోజులకే మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే (Jagtial MLA) సంజయ్‌కుమార్‌ ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీనియర్ BRS ఎమ్మెల్యే, అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జూన్ 21న కాంగ్రెస్ చేరిన‌ నేపథ్యంలో సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరిన‌ట్లు తెలుస్తోంది.

జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని కాంగ్రెస్‌లో చేరారు. సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లోకి టీపీసీసీ చీఫ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాగతించారు. సంజయ్ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తగా పని చేస్తూ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

Also Read: Lok Sabha Session : కాసేపట్లో ఎంపీల ప్రమాణ స్వీకారాలు.. నేటి లోక్‌సభ షెడ్యూల్ ఇదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఐదుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ అధికార పార్టీలో చేరడంతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం బలం 38 నుంచి 33కి పడిపోయింది. అయితే బీఆర్ఎస్ కీల‌క నేత‌లు మాత్రం వీరి చేరిక‌ను వ్య‌తిరేకిస్తున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక‌లా.. లేన‌ప్పుడు ఒక‌లా ఉండ‌కూడ‌దంటూ విమ‌ర్శిస్తున్నారు. రానున్న రోజుల్లో మరికొంతమంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వృత్తిరీత్యా వైద్యుడైన సంజయ్ కుమార్ జ‌గిత్యాల‌ రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యారు.

We’re now on WhatsApp : Click to Join

గత నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఘోర పరాజయం తర్వాత పార్టీ మారిన తొలి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత BRS పార్టీకి ప‌లువురు కీల‌క నేత‌లు రాజీనామా చేసి అధికార కాంగ్రెస్‌, బీజేపీలో చేరారు. రానున్న రోజుల్లో ఈ చేరిక‌లు మ‌రింత ఊపందుకుంటాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.