Site icon HashtagU Telugu

Jagga Reddy: బీజేపీ, బిఆర్ఎస్‌ పార్టీలను ఓడించడమే లక్ష్యంగా పని చేయాలి.. ఆ నేతలకు జగ్గారెడ్డి పిలుపు

Jaggareddy

Jaggareddy

Jagga Reddy: కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక కారణాల వల్ల పార్టీ వీడి పోయిన నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఏ కారణం చేత అయిన పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులు తిరిగి పార్టీలో చేరి పార్లమెంట్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చిందని ఆయన అన్నారు. పార్టీ లో చేరే వారు బేషరతుగా పార్టీ లోకి ఆహ్వానించాలని, పార్టీ జిల్లా నాయకులు, నియోజక వర్గ నాయకులు పెద్ద మనసు చేసుకొని వారిని ఆహ్వానించాలని పార్టీ నేతలకు జగ్గారెడ్డి సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని ఏఐసీసీ సూచనలు చేసిందని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పట్ల ఆకర్షితులైన ఇతర పార్టీ నాయకులు, పార్టీ విధి విధానాలు అర్థం చేసుకొని పార్టీలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారు కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని జగ్గారెడ్డి అన్నారు. కలిసికట్టుగా పనిచేసి ప్రజా వ్యతిరేక విధానాలను పాటిస్తున్న బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను ఓడించే లక్ష్యంగా అందరూ కలిసి కట్టుగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు జగ్గారెడ్డి.

ఈ రోజు సాయంత్రం గాంధీ భవన్ లో చేరికలు ఉంటాయని, పార్టీ లో చేరేందుకు వచ్చే నాయకులు మీ నియోజక వర్గ ఎమ్మెల్యే లకు గాని నియోజక వర్గ ఇంచార్జ్ గాని, డీసీసీ అధ్యక్షులు సమాచారం ఇచ్చి గాంధీ భవన్ కు రాగలరని నాయకులకు జగ్గారెడ్డి సూచనలు చేశారు.