తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth ) జహీరాబాద్ (Zaheerabad) సభలో కీలక ప్రకటనలు చేశారు. జహీరాబాద్ పారిశ్రామిక వాడ (నిమ్జ్) భూసేకరణలో అన్యాయం జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, భూములు కోల్పోతున్న 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ బాధ్యతను జగ్గారెడ్డికి అప్పగిస్తున్నట్లు తెలిపారు. నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు అందించి, వారికి సముచిత న్యాయం జరిగేలా చూస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. భోజనం పెట్టి పట్టాలు అందించే దాకా జగ్గారెడ్డి (Jaggareddy) చూస్తారని పేర్కొంటూ, ఆయనపై తన విశ్వాసాన్ని చూపించారు.
Kavitha Letter : కవితతో సీఎం రేవంతే లేఖ రాయించారా? – ఎంపీ రఘునందన్
రాష్ట్రాభివృద్ధిపై తన ప్రభుత్వ దృష్టిని వివరించిన రేవంత్ రెడ్డి.. “ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు, మిగతా సమయంలో అభివృద్ధే మా లక్ష్యం” అన్నారు. నిమ్జ్ ప్రాజెక్టులో భాగంగా హ్యుందాయ్ కార్ల తయారీ సంస్థను తీసుకురావడమే కాక, చక్కెర పరిశ్రమను పునరుద్ధరించేందుకు 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు సిద్ధమని చెప్పారు. సింగూరు ప్రాజెక్టును టూరిజం హబ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్రం సహకారంతో ఉమ్మడి మెదక్ జిల్లాను అభివృద్ధి చేయాలనే దృక్పథంతో ముందుకు సాగుతామని తెలిపారు.
అలాగే రైతుల సంక్షేమం, మహిళా సాధికారతపై ముఖ్యమంత్రి ముఖ్యమైన ప్రకటనలు చేశారు. వరి పంటకు బోనస్ ఇవ్వడం, రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేయడం, భూమిలేని రైతులకు కూడా రాయితీలు కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని బలోపేతం చేస్తున్నామని వివరించారు. అలాగే మహాలక్ష్మి పథకం కోసం ఇప్పటికే రూ.5500 కోట్లు కేటాయించామని, లక్షలాది మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ, సోనియమ్మ స్పూర్తితో తెలంగాణ ఆడబిడ్డల భవిష్యత్‌ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.