Jagan Mohan Rao : HCA కొత్త అధ్యక్షుడిగా జగన్ మోహన్ రావు

క్రికెట్ వర్గాల్లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా అర్శనపల్లి జగన్

  • Written By:
  • Publish Date - October 20, 2023 / 10:13 PM IST

క్రికెట్ వర్గాల్లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా అర్శనపల్లి జగన్ మోహన్ రావు విజయం సాధించారు. దాదాపు ప్రతీ పదవికి పోటీ నువ్వా నేనా అన్నట్టు పోటీ నడిచింది.
మొత్తం 173 ఓట్లు ఉండగా.. 169 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ క్రికెటర్లు వెంకటపతి రాజు, వీవీఎస్ లక్ష్మణ్, శివాలాల్ యాదవ్, మిథాలీ రాజ్, స్రవంతి నాయుడు కూడా ఓటు వేశారు. అలాగే జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ నుంచి పోటీ చేసిన జగన్ మోహన్ రావు ఒక్క ఓటు మెజార్టీతో క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ అభ్యర్ధి అమర్నాథ్ పై గెలుపొందారు.జగన్ మోహన్ రావుకు మొత్తం 63 ఓట్లు రాగా.. ఆయన సమీప అభ్యర్థి అమర్నాథ్‌కు 62 ఓట్లు వచ్చాయి. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్, అర్షద్ ఆయుబ్ మద్దతుతో పోటీ పడిన అమర్నాథ్ తృటిలో ఓడిపోయారు. జగన్ మోహన్ రావు ప్యానెల్ కు అధికార బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్‌కు అధ్యక్ష పదవితో పాటు ట్రెజరర్ పదవి దక్కింది. ట్రెజరర్ గా సిజే శ్రీనివాస్ రావు విజయం సాధించారు. ఆయనకు 66 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి సంజీవ్‌కు 33 ఓట్లు దక్కాయి. సెక్రటరీగా క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ కు చెందిన ఆర్.దేవరాజ్ గెలుపొందారు.

We’re now on WhatsApp. Click to Join.

క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ కౌన్సిలర్ పదవిని మాత్రమే సొంతం చేసుకుంది. సునీల్ కుమార్ 59 ఓట్లతో ఈ పదవిని దక్కించుకున్నారు. సమీప అభ్యర్థులు అన్సార్ అహ్మద్‌కు 50 ఓట్లు రాగా.. వినోద్ ఇంగ్లేకు 47 వచ్చాయి.గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ వైస్ ప్రెసిడెంట్ పదవితో పాటు జాయింట్ సెక్రటరీ పదవిని సొంతం చేసుకుంది. దళ్జిత్ సింగ్ 17 ఓట్ల మేజార్టీతో వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు మొత్తం 63 ఓట్లు పోలయ్యాయి. ఇదే ప్యానెల్ నుంచి జాయింట్ సెక్రెటరీగా బసవరాజు ఎన్నికయ్యారు. ఆయనకు 60 ఓట్లు రాగా.. శ్రీధర్‌కు 59, నోయల్ డేవిడ్‌కు 40, సతీష్‌కు 8 ఓట్లు పడ్డాయి. సుప్రీం కోర్టు ద్వారా జస్టిస్ లావు నాగేశ్వర రావు ఆధ్వర్యంలో నియమించిన సింగిల్ మెంబర్ కమిటీ ఈ ఎన్నికలను పర్యవేక్షించింది. వీఎల్ సంపత్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సెక్రటరీగా కూడా ఉన్న జగన్ మోహన్ రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను గాడిన పెట్టాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read:  BRS Govt: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా బోనస్‌

HCA కొత్త కార్యవర్గం :
జగన్ మోహన్ రావు (అధ్యక్షుడు, యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ HCA ప్యానెల్)
దళ్జిత్ సింగ్ ( వైస్ ప్రెసిడెంట్, గుడ్ గవర్నెన్స్ ప్యానేల్)
దేవరాజు (సెక్ర‌ట‌రీ, క్రికెట్ ఫస్ట్ ప్యానెల్) బసవరాజు (జాయింట్ సెక్ర‌టరీ, గుడ్ గవర్నెన్స్ ప్యానెల్)
సీజే శ్రీనివాస్ రావు (ట్రెజర‌ర్‌, యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ HCA ప్యానెల్)
సునీల్ అగర్వాల్ ( కౌన్సిలర్‌, క్రికెట్ ఫస్ట్ ప్యానెల్)