IVF Services : తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లోగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సేవలను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. మారిన జీవన శైలి, వాతావరణ పరిస్థితుల వల్ల ఎంతోమందికి సంతాన సాఫల్య సమస్యలు ఎదురవుతున్నాయని దామోదర తెలిపారు. పేదలు ప్రైవేటు ఐవీఎఫ్ క్లినిక్‌లలో చికిత్స చేయించుకునే స్థితిలో లేరని, అలాంటి వారి కోసమే గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్(IVF Services) సేవలను తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి, కింగ్ కోఠి దవాఖానాలను మంత్రి దామోదర రాజనర్సింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రులలోని ఓపీలతో పాటు వార్డులలో ఆయన తిరిగారు. వైద్యసేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గాంధీ ఆస్పత్రిలో గేరియాట్రిక్ సేవలను కూడా ప్రారంభిస్తామన్నారు. ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలకు అదనపు యూనిట్లను కేటాయిస్తామని దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలో మెడికోల హాస్టల్ బిల్డింగ్‌కు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘నేను గాంధీ హాస్పిటల్‌లోనే పుట్టాను. ఇక్కడికి వచ్చే పేదల కష్టాలన్నీ నాకు తెలుసు. ప్రభుత్వ దవాఖానాలకు వచ్చేది సాధారణ ప్రజలే. దొరలు ఎవ్వరూ ఇక్కడికి రారు. వీళ్లకు క్వాలిటీ వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఆఫీసర్లు, వైద్యాధికారులు, డాక్టర్లు, ఇతర స్టాఫ్దీన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. దొరలకు రోగమొస్తే కార్పొరేట్ హాస్పిటళ్లకు పోతరు. మా వాళ్లే ఇక్కడికొస్తరు’’ అని ఈసందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.గాంధీ ఆస్పత్రిలో పేషెంట్లకు అందించే ఆహారంలోనూ క్వాలిటీ ఉండాలన్నారు. రోగులతో పాటు ఆస్పత్రిలో ఉండే అటెండర్లకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. ఈమేరకు గాంధీ, కింగ్ కోఠి ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద ఆరోగ్యశాఖ మంత్రి తనిఖీలతో గాంధీ, కింగ్ కోఠి ఆస్పత్రి సిబ్బంది అలర్ట్ అయ్యారు. పేదల కోసం మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రుల సిబ్బందికి దామోదర రాజనర్సింహ పిలుపునివ్వడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.