కేసీఆర్ పిలుపు బంగార‌మాయే..! యాదాద్రికి ఒక్క రోజులో 40కేజీల బంగారం విరాళం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేర‌కు ఒక రోజు 40 కేజీల బంగారం విరాళం వ‌చ్చింది. తొలి విరాళంగా కేజీ బంగారాన్ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఇక ఆయ‌న బాట‌న పారిశ్రామిక‌వేత్త‌లు, వ్యాపారులు, రాజ‌కీయ నాయ‌కుల బంగారం విరాళంగా ఇవ్వ‌డానికి క్యూ క‌ట్టారు.

  • Written By:
  • Publish Date - October 22, 2021 / 08:00 PM IST

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేర‌కు ఒక రోజు 40 కేజీల బంగారం విరాళం వ‌చ్చింది. తొలి విరాళంగా కేజీ బంగారాన్ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఇక ఆయ‌న బాట‌న పారిశ్రామిక‌వేత్త‌లు, వ్యాపారులు, రాజ‌కీయ నాయ‌కుల బంగారం విరాళంగా ఇవ్వ‌డానికి క్యూ క‌ట్టారు. మొత్తం 125 కేజీల బంగారం తాప‌డంతో యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ దేవాల‌యం గోపుర శిఖారాలను రూప‌క‌ల్ప‌న చేస్తున్నారు. వాటి త‌యారీ కోసం విరాళంగా హెటిరో డ్ర‌గ్స్ చైర్మ‌న్ పార్థ‌సార‌థి 5 కేజీల బంగారం, మెఘా ఇంజ‌నీరింగ్ కంపెనీ 6 కేజీలు ప్ర‌క‌టించారు. దాత‌ల జాబితాలో 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంకా అనేక మంది బంగారం ఇవ్వ‌డానికి ముందుకు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

భువ‌నగిరి జిల్లా యాదాద్రి పున‌ర్నిర్మాణం కోసం తిరుమ‌ల మోడ‌ల్ ను కేసీఆర్ తీసుకున్నారు. త్రిదండి జిన్న‌జియ్య‌ర్ సూచ‌న‌లు, స‌ల‌హాల మేర‌కు ప్రాజెక్టును రూపొందించారు. ప్రభుత్వ ప్రాధాన్య‌త ప్రాజెక్టుల్లో ఈ దేవాల‌యాన్ని ఉంచారు. ప్ర‌తి ఏడాది బ‌డ్జెట్ లో నిధుల‌ను ప‌క్కాగా కేటాయించారు. గ‌త మూడేళ్ల‌లో 618 కోట్ల‌ను కేటాయించి ప్రాజెక్టు నిర్మాణం వేగ‌వంతంగా చేశారు. ఈ ఏడాది 350కోట్ల‌ను కేటాయించ‌డంతో దాదాపు పున‌ర్నిర్మాణ ప‌నులు పూర్తి కావ‌చ్చాయి. మొత్తం 1000 కోట్లను యాదాద్రి కోసం ప్ర‌భుత్వం ఖ‌ర్చు పెట్టింది.
యాదాద్రి ప్రాజెక్టు పూర్తి కావ‌డంతో ప‌రిస‌ర ప్రాంతాల్లో వ్యాపారాలు అనూహ్యంగా ఊపందుకున్నాయి. ప్ర‌ధానంగా రియ‌ల్ ఎస్టేట్ ఊహించ‌ని విధంగా పెరిగింది. యాద‌గిరి గుట్ట టెంపుల్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ అన్ని ర‌కాల ఏర్పాట్ల‌ను చేస్తోంది.ఈ ప్రాజెక్టు అభివృద్ధితో పాటు వివిధ రంగాలు ఇక్క‌డ వేగంగా పుంజుకున్నాయి. రాబోయే రోజుల్లో తిరుమ‌ల త‌ర‌హాలో యాత్రా స్థ‌లం ప్ర‌సిద్ధి చెందుతుంద‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. మొత్తం మీద కేసీఆర్ అనుకున్న విధంగా యాదాద్రి ప్రారంభం త్వ‌ర‌లోనే కాబోతుంది.