Site icon HashtagU Telugu

KCR: చంద్రబాబును ఎదురించడం ఆషామాషీ కాదు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Chandrababu Kcr

Chandrababu Kcr

KCR: రెండున్నర దశాబ్దాల బిఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని., ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తుందని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు.

తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడిన దిక్కు మొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన అటునుంచి పదేండ్ల ప్రగతి పాలన దాకా తాను ఎదుర్కున్న కష్టాలను కేసీఆర్ గారు ఈ సందర్భంగా కార్యకర్తలకు వివరించారు. ఆనాడు తెలంగాణను అష్ట దిగ్భందనం చేసిన సమైక్యవాద శక్తులు, వారి మీడియాతో సహా సమస్త రంగాలు.. వాళ్లు రాసిందే రాత గీసిందే గీత’గా నడిచేదని గుర్తుచేశారు.

అత్యంత శక్తివంతమైన ఆంధ్రా వ్యవస్థలను తట్టుకుంటూ, తెలంగాణ వ్యతిరేకతకు, సమైక్య వాదానికి సింబాలిక్ గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబు నాయుడును ఎదిరించి నిలవడం అంటే అషమాషీ వ్యవహారం కాదని అన్నారు. అటువంటి సమైక్య వాద కుటిల వ్యవస్థలనే బద్దలుకొట్టి తెలంగాణను సాధించి, కలబడి నిలబడిన తెలంగాణ సమాజం, భవిష్యత్తులో ఎటువంటి ప్రతిబంధక పరిస్థితిలనైనా అధిగమిస్తుందని కేసీఆర్ భరోసా వ్యక్తం చేశారు.

గెలుపు ఓటములకు అతీతంగా తెలంగాణ సమాజం మనకు ఎల్లవేళలా అండగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని కార్యకర్తల జై తెలంగాణ నినాదాల నడుమ కేసీఆర్ ప్రకటించారు. శత్రువుల ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రతిహతంగా కొనసాగుతున్న బిఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టి తీసినట్టయిందని, తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగట్టాలని కార్యకర్తల హర్షధ్వానాల నడుమ కేసీఆర్ ప్రకటించారు.

ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రేస్ పార్టీ, ఇచ్చిన అలవిగాని హామీలు అమలు చేయడం చేతగాక పలురకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నదని దుయ్యబట్టారు. కాంగ్రేసు పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు, ఓటేసి పొరపాటు చేసినామని నాలిక కరుసుకుంటున్నారని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణలో మున్నెన్నడూ లేనివిధంగా ప్రశాంతమైన పాలన ద్వారా పదేండ్లపాటు సంక్షేమం అభివృద్ధిని అందిస్తూ అన్ని తీర్లా అండగా నిలబడ్డ బిఆర్ఎస్ పార్టీని తిరిగి తెలంగాణ సమాజం కోరుకుంటున్నదని కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ మీద ద్వేషం తో, అసంబద్ధ ప్రకటనలతో,, ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడస్తున్న కాంగ్రేస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరుగబడే రోజులు త్వరలోనే రానున్నాయని స్పష్టం చేశారు.