IT Raids : మంత్రి మ‌ల్లారెడ్డి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు..ప‌లు కీల‌క‌ప‌త్రాలు స్వాధీనం

తెలంగాణ మంత్రి మ‌ల్లారెడ్డి నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. రెండు రోజుల పాటు ఏక‌ధాటిగా కొన‌సాగిన సోదాల్లో ప‌లు కీల‌క...

  • Written By:
  • Publish Date - November 24, 2022 / 07:19 AM IST

తెలంగాణ మంత్రి మ‌ల్లారెడ్డి నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. రెండు రోజుల పాటు ఏక‌ధాటిగా కొన‌సాగిన సోదాల్లో ప‌లు కీల‌క ప‌త్రాలు స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం. అయితే మ‌ల్లారెడ్డి అల్లుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు కొన‌సాగే అవ‌కాశం ఉంది. విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఈ రోజు హైద‌రాబాద్ చేరుకోనున్నారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌చ్చిన త‌రువాత సోదాలు కొన‌సాగే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌ల్లారెడ్డి నివాసం, ఆయ‌న బంధువుల ఇళ్ల‌లో రెండు రోజులపాటూ 65 బృందాలుగా.. 400 మంది అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఐటీ సోదాల్లో 10 కోట్ల 50 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మల్లారెడ్డి ఇంట్లో సోదాలు ముగిసిన తర్వాత నోటీసులు ఇచ్చిన ఐటీ అధికారులు.. సోమవారం తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు.

మల్లారెడ్డి విద్యాసంస్థల్లో అక్రమాలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ప్రభుత్వ రాయితీలు ఉన్నప్పటికీ అధికంగా ఫీజులు వసూలు చేశారని సమాచారం. అనధికార వసూళ్లను రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులుగా పెట్టినా.. వాటి వివరాలేవీ ఐటీ పత్రాల్లో చూపించలేదని తెలుస్తోంది. ఇటు ఐటీ సోదాలు ముగిసిన త‌ర్వాత బోయిన్‌ప‌ల్లి పీఎస్ వ‌ద్ద హైడ్రామా జ‌రిగింది. మంత్రి మ‌ల్లారెడ్డి ఐటీ అధికారుల‌పై ఫిర్యాదు చేశారు. త‌న కుమారుడితో బ‌ల‌వంతంగా సంత‌కాలు పెట్టించారంటూ మ‌ల్లారెడ్డి ఆరోపించారు. ఇటు ఐటీ అధికారులు కూడా తాము స్వాధీనం చేసుకున్న ల్యాప్‌ట్యాప్‌ని లాక్కున్నార‌ని పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.