Site icon HashtagU Telugu

Telangana Sentiment : తెలంగాణ సెంటిమెంట్ ఇంకా సజీవంగా ఉందా?

Telangana Sentiment

Telangana Sentiment

By: డా. ప్రసాదమూర్తి

Telangana Sentiment : గడచిన రెండు దఫాల ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ను ప్రాణాధారం చేసుకుని అధికారం చేపట్టిన కేసీఆర్, మూడో దఫా కూడా అదే సెంటిమెంటును కీలకాస్త్రంగా ప్రయోగిస్తున్నారా? ఇటీవల ఆయన సభలు చేస్తున్న, ఉపన్యాసాలు, ప్రజలకు చేస్తున్న హెచ్చరికలు మొదలైనవి చూస్తే అవుననే అనిపిస్తుంది. తెలంగాణ సెంటిమెంటు ఎంతవరకు ఇప్పుడు వర్కవుట్ అవుతుంది అనే విషయం అలా ఉంచితే, అధికార బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆ సెంటిమెంట్ ఇంకా సజీవంగా ఉన్నట్టు నమ్ముతున్నారని అనిపిస్తుంది. పథకాల ప్రస్తావన క్రమక్రమంగా మరుగున పడి, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం సెంటర్ స్టేజ్ మీదకు వస్తున్నట్టు కనిపిస్తోంది.

We’re Now on WhatsApp. Click to Join.

ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయేనని తేలిపోయిన తర్వాత అటు కేసీఆర్ గానీ, ఇటు బిజెపి వారు గానీ కాంగ్రెస్ పార్టీ మీద దాడిని కేంద్రీకరించారు. ఓ పక్క కాంగ్రెస్ పార్టీ కర్ణాటక లో సాధించిన విజయోత్సవంతో అవే పథకాలను తెలంగాణలో కూడా ప్రకటించింది. కేవలం పథకాలు మాత్రమే కాకుండా తెలంగాణ సెంటిమెంటును తాము క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించకపోతే, సోనియా గాంధీ ఆశీస్సులు లభించకపోతే తెలంగాణ ఏర్పడేది కాదని, తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్న వారికి రెండు సార్లు అధికారం ఇచ్చారు కానీ తెలంగాణ ఇచ్చిన వారికి ఒకసారైనా అధికారం ఇచ్చి చూడండి అని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు బలంగా ఒక అభ్యర్థన పెడుతోంది. దీంతో ప్రజలు ఆలోచనలో పడినట్లు కనిపిస్తోంది.

ఎంతో కాలంగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎదురుచూసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్రం వచ్చేది కాదని, ఆనాడు సోనియా ఆశీస్సులు లభించకపోతే ప్రత్యేక రాష్ట్రం సాధించుకునే వాళ్ళం కాదని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం. తెలంగాణ ప్రజలు అలా నమ్ముతున్నా లేకున్నా ఆ సెంటిమెంట్ ని ఇప్పుడు ఎన్నికల్లో వాడుకోవడమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ మార్చుకుంది.

సెంటిమెంట్ (Telangana Sentiment) తోనే కాంగ్రెస్ పై కేసీఆర్ దాడి:

కాంగ్రెస్ పార్టీ ఏ తెలంగాణ సెంటిమెంట్ (Telangana Sentiment)ని వాడుకొని ఇప్పుడు అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నం చేస్తుందో, అదే తెలంగాణ సెంటిమెంట్ తో కాంగ్రెస్ మీదకు కేసిఆర్ దాడికి దిగారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడే తెలంగాణను కూడా ఆంధ్రప్రదేశ్లో కలిపి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిందని కేసీఆర్ చరిత్రలోకి దిగి మరీ సెంటిమెంటును తిరిగి రాజేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడానికి ఎన్నో ఉద్యమాలు జరిగాయని, ఆ ఉద్యమాలు జరిగిన ప్రతిసారీ అణచివేసింది కాంగ్రెస్ పార్టీయే అని కేసీఆర్ వాదన. 1969 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసి 400 మంది ప్రాణాలను బలి కొన్నది కూడా కాంగ్రెస్ పార్టీ అని కేసిఆర్ చెప్తున్నారు. అప్పట్లో తాము ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించకపోతే ఎందరో యువకులు ప్రాణాలు బలిదానం చేయకపోతే ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ మనకు దక్కనిచ్చేది కాదని కేసీఆర్ గట్టిగా తన వాదన వినిపిస్తున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా సమైక్యవాదులు రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధకారబంధురమైపోతుందని, అన్యాయం అయిపోతుందని వాదించారని, రాష్ట్రం సాధించుకున్నాక ఇప్పుడు మనం ఎంత అభివృద్ధి దిశగా పయనిస్తున్నామో చూడండి అని కేసిఆర్ ప్రజల ముందు తెలంగాణ సెంటిమెంట్ (Telangana Sentiment)తో కూడిన వాదనను బలంగా పెడుతున్నారు. ఎన్నికల్లో ప్రధానంగా తాము గతంలో ఏం చేశామో చెప్తూ భవిష్యత్తులో ఏం చేస్తామో నాయకులు వాగ్దానం చేస్తారు. అలాగే ప్రతిపక్షాల వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్లు ఏం చేశారు.. ఏం చేయలేదో విమర్శలు చేసి తాము చేసే మంచి పనులేవో ఏకరవు పెడతారు. కానీ విచిత్రంగా తెలంగాణలో అవన్నీ క్రమక్రమంగా తెరమరుగున పడి తెలంగాణ సెంటిమెంట్ (Telangana Sentiment) మాత్రమే మరోసారి కేంద్ర బిందువుగా మారిపోయింది.

తెలంగాణ ప్రజలలో ఇప్పుడు ఎక్కడా సెంటిమెంట్ లేదని, అభివృద్ధి మాత్రమే వారి హృదయాల్లో ఉందని, నిధులు, నీళ్లు, నియామకాలు అంటూ వచ్చిన నాయకులు తమ వాగ్దానాలు ఎంతవరకు నిలబెట్టుకున్నారు అనే విషయాన్ని మాత్రమే తెలంగాణ ప్రజలు ఇప్పుడు చర్చించుకుంటున్నారని చాలా సర్వేలలో వెల్లడవుతున్న గ్రౌండ్ రిపోర్టులతో మనకు అర్థమవుతుంది. ప్రజలు ఏమనుకుంటున్నప్పటికీ నాయకులు ఏమనుకుంటున్నారు అనేదే కీలకంగా మారుతుంది. ప్రజల మనోభావాలు కూడా నాయకుల మాటల పునాదుల మీద మీడియా సాగిస్తున్న ప్రచారంతో మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

ఎన్నికల్లో ఇంకా తెలంగాణ సెంటిమెంట్ సజీవంగా ఉందా.. లేక తెలంగాణ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారా.. అలా అభివృద్ధిని కోరుకునే క్రమంలో ఏ పార్టీని ఎంచుకుంటారు అనేది ఎదురు చూడాల్సిందే.

Also Read:  MLC Kavitha: గులాబీల జెండలే రామక్క పాటకు కవిత స్టెప్పులు, వీడియో చూశారా!