కారు స్టీరింగ్ ’కేటీఆర్‘ కు చిక్కేనా..?

పెద్ద సార్ కేసీఆర్ ఏమారు కూడా పార్టీ పగ్గాలు చేపడుతారా..? లేదంటే కేటీఆర్ కు పూర్తిస్థాయి బాధ్యతలు కట్టబెడుతారా.? ప్రస్తుతం అధికార పార్టీ అయినా టీఆఎస్ లో ఇదే చర్చలు జోరుగా నడుస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - October 15, 2021 / 10:00 AM IST

పెద్ద సార్ కేసీఆర్ ఏమారు కూడా పార్టీ పగ్గాలు చేపడుతారా..? లేదంటే కేటీఆర్ కు పూర్తిస్థాయి బాధ్యతలు కట్టబెడుతారా.? ప్రస్తుతం అధికార పార్టీ అయినా టీఆఎస్ లో ఇదే చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి నూతన అధ్యక్షుడిని అక్టోబర్ 25 న పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఎన్నుకుంటారు. అక్టోబర్ 17 నుంచి 22 వరకు టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 23 న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24. కొత్త అధ్యక్షుడి ఎన్నిక తర్వాత, COVID-19, అసెంబ్లీ ఎన్నికల కారణంగా వరుసగా రెండు సంవత్సరాలు నిర్వహించలేని పార్టీ ప్లీనరీ ఈసారి మాత్రం కచ్చితంగా జరగబోతోంది. ప్లీనరీకి దాదాపు 13,000 నుంచి 14,000 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలుస్తోంది.

టీఆర్ఎస్ ఇప్పటికే గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. అధ్యక్షుడి ఎన్నికకు సన్నాహకంగా సమావేశం అక్టోబర్ 17 న హైదరాబాద్‌లో జరగనుంది. రెండు దశాబ్దాల చరిత్రలో టీఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో ఎన్నో విజయాలను అందుకుంది. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను కొన్ని కాపీ కొట్టాయని వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత ఏడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను తెలియజేయడానికి భారీ బహిరంగ సభ ‘తెలంగాణ విజయ గర్జన’ నవంబర్ 15 న వరంగల్‌లో ఘనంగా జరుగనుందని, విజయ గర్జనలో భాగంగా ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తామని ఆయన అన్నారు.

అక్టోబర్ 27 న వరంగల్ సమావేశానికి ముందు మొత్తం 119 సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించబడతాయని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఈ పోటీ తీవ్రమైనది కాదు. మా నాయకులు ఇప్పటికే అక్కడ ప్రచారం చేస్తున్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్లీనరీలోనైనా తన కుమారుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది.