Jan Suraj : ఔను! వాళ్లిద్ద‌రూ ‘జ‌న్ సురాజ్’ లే.!!

తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతోన్న కొత్త పార్టీ ప్ర‌శాంత్ కిషోర్ రూపంలో బ‌య‌ట‌కొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. కొత్త పార్టీ గురించి పీకే చేసిన ట్వీట్ కేసీఆర్ ఇటీవ‌ల వినిపించిన భావ‌జాలానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. ప్ర‌జానుకూల విధానాన్ని రూపొందించ‌డానికి సిద్ధం అవుతున్న‌ట్టు ట్వీట్ ద్వారా పీకే ప్ర‌క‌టించారు.

  • Written By:
  • Publish Date - May 2, 2022 / 02:31 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతోన్న కొత్త పార్టీ ప్ర‌శాంత్ కిషోర్ రూపంలో బ‌య‌ట‌కొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. కొత్త పార్టీ గురించి పీకే చేసిన ట్వీట్ కేసీఆర్ ఇటీవ‌ల వినిపించిన భావ‌జాలానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. ప్ర‌జానుకూల విధానాన్ని రూపొందించ‌డానికి సిద్ధం అవుతున్న‌ట్టు ట్వీట్ ద్వారా పీకే ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌డానికి `జ‌న్ సురాజ్‌` ను ఆవిష్క‌రిస్తున్న‌ట్టు క్లుప్లంగా చేసిన ట్వీట్ సంచ‌ల‌నం రేపుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్లీన‌రీ వేదిక‌గా దేశానికి ప్ర‌త్యామ్నాయ ఎజెండా కావాల‌ని ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా `పీకే` ట్వీట్ ఉంది.

కాంగ్రెస్‌, బీజేయేత‌ర ప్ర‌త్యామ్నాయ ఎజెండా కావాల‌ని కేసీఆర్ భావించారు. ఆ మేర‌కు హుజారాబాద్ ఉప ఎన్నిక‌ల త‌రువాత త‌ర‌చూ ఆయ‌న గ‌ళం విప్పుతూ వ‌స్తున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ను ప‌క్క‌న‌ప‌డేసి ప్ర‌త్యేక ఎజెండా దిశ‌గా ముందుకు క‌దిలారు. తొలుత బీజేపీ, కాంగ్రెసేత‌ర కూట‌మి అంటూ 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేసీఆర్ దేశ రాజ‌కీయాల‌పై క‌న్నేశారు. ఆ స‌మ‌యంలో ప‌లు రాష్ట్రాల సీఎంలు, ఆయా రాష్ట్రాలోని రాజ‌కీయ పార్టీల చీఫ్ ల‌ను క‌లుసుకున్నారు. రెండోసారి సీఎం అయిన త‌రువాత ఇటీవ‌ల‌దాకా మౌనం వ‌హించారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ నుంచి మోడీతో భేటీకి కేసీఆర్ కు అవ‌కాశం ల‌భించ‌లేదు. దీంతో మోడీ స‌ర్కార్ పై ధ్వ‌జ‌మెత్త‌డం మొద‌లు పెట్టారు. ముచ్చింత‌ల్ స‌మ‌తామూర్తి విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌, భార‌త్ బ‌యోటెక్ ప‌రిశీల‌న కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన మోడీ టూర్ వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఆజ్యం పోసింది. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌ల‌కు కేసీఆర్‌ దూరంగా ఉండాల‌ని పీఎంవో కార్యాల‌యం సంకేతం ఇచ్చింద‌ని మంత్రి కేటీఆర్ ఇటీవ‌ల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. వెంట‌నే పీఎంవో కార్యాల‌యం ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ఖండించిన‌ప్ప‌టికీ మోడీ, కేసీఆర్ మ‌ధ్య వ్య‌క్తిగ‌త `ఇగో` వ్య‌వ‌హారం ఏదో ఉంద‌ని టాక్‌.

ఇటీవ‌ల కాంగ్రెస్ తో కూడిన కూట‌మి దిశ‌గా కేసీఆర్‌, పీకే ఇద్ద‌రూ అడుగులు వేశారు. బెంగాల్ ఎన్నిక‌ల త‌రువాత యూపీఏ ఉనికి లేద‌ని ప్ర‌చారాన్ని లెవ‌నెత్తారు. ఆ విష‌యాన్ని మ‌మ‌త బాగా హైలెట్ చేశారు. ఆ త‌రువాత ముంబాయ్ లో శ‌ర‌ద్ ప‌వార్‌, పీకే భేటీ త‌రువాత యూపీయే గురించి స‌న్నాయినొక్కులు నొక్క‌డం ప్రారంభించారు. కాంగ్రెస్ లేకుండా మోడీ స‌ర్కార్ ను ప‌డేయ‌డం క‌ష్ట‌మ‌ని భావించారు. ఆ స‌మ‌యంలో రాహుల్ గాంధీకి అనుకూలంగా కేసీఆర్ స్పందించారు. రాహుల్ పుట్టుక‌పై బీజేపీ నాయ‌కులు చేసిన కామెంట్ల‌ను ఖండిస్తూ అండ‌గా నిలిచారు. అదే స‌మ‌యంలో పీకే కాంగ్రెస్ పార్టీలో చేర‌డానికి స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డారు. సుమారు 600 స్లైడ్ ల‌ను ప్ర‌ద‌ర్శించ‌డం ద్వారా కాంగ్రెస్ నిర్మాణాన్ని మార్చాల‌ని ప్ర‌య‌త్నం చేశారు. ఆయ‌న సూచించిన అంశాల‌పై సోనియా కూడా సానుకూలంగా ఉన్నార‌ని టాక్ న‌డిచింది. కాంగ్రెస్ పార్టీలో చేర‌డానికి మార్గం సుగ‌మం అయింద‌ని స‌ర్వ‌త్రా ప్ర‌చారం జ‌రిగింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో కేసీఆర్ తో `పీకే` భేటీ అయ్యారు.

ప్ర‌గ‌తిభ‌వ‌న్ వేదిక‌గా రెండు రోజుల పాటు సుదీర్ఘంగా మంత‌నాలు వాళ్లిద్ద‌రి మ‌ధ్య జరిగాయి. ఆక‌స్మాత్తుగా కాంగ్రెస్ పార్టీకి త‌న అవ‌స‌రం లేదంటూ `పీకే` ప్ర‌క‌టించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ, పీకే మ‌ధ్య మంత‌నాలు ఆగిపోయాయి. దీనికి కార‌ణం కేసీఆర్ వేసిన ఎత్తుగ‌డ‌గా కాంగ్రెస్ భావిస్తోంది. సీన్ క‌ట్ చేస్తే, కొత్త పార్టీని ప్ర‌శాంత్ కిషోర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌న వెనుక కేసీఆర్ ప్ర‌మేయం లేద‌ని అనుకోలేం. ఏడేళ్ల ప‌రిచ‌యం వాళ్లిద్ద‌రి మ‌ధ్యా ఉంద‌ని కేసీఆర్ ఇటీవ‌ల వెల్ల‌డించారు. హైద‌రాబాద్ కేంద్రంగా దేశానికి ప్ర‌త్యామ్నాయ ఎజెండా వ‌స్తుంద‌ని అన్నారు. అందుకు త‌గిన విధంగా `పీకే` ట్వీట్ ఉండ‌డంతో కేసీఆర్ కొత్త పార్టీ ఇదేనంటూ చర్చ జ‌రుగుతోంది.