Site icon HashtagU Telugu

Revanth Reddy: రేవంత్ ప్రభుత్వం ‘కొసెల్తదా’?

Congress Government In Telangana

Congress Government In Telangana

”ఈ ప్రభుత్వం కొసెల్తదా”? అని తమ ఛానల్ రిపోర్టర్ ఒకరిని,ప్రముఖ న్యూస్ ఛానల్ చైర్మన్ రెండు నెలల కిందట అడిగాడు.కొసెల్తదా ! అనేది పక్కా తెలంగాణ మాండలికపు పదం.కేసీఆర్,రేవంత్ రెడ్డికి బాగా తెలుసు.’ కొసెల్లడం’ అంటే చివరివరకు ఉంటుందా? అని అర్ధం.’రేవంత్ కొసెల్లుతడా’ అంటే ఆయన ముఖ్యమంత్రిగా పూర్తి కాలం ఐదేండ్లు పదవిలో ఉంటారా? అనే అర్ధం వస్తుంది.ఆ న్యూస్ ఛానల్ చైర్మన్ ఒక్కరే కాదు,కొన్ని దినపత్రికల అధిపతులు,ఢక్కా ముక్కీలు తిన్న సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నారు.అంతలా మీడియాలో అనుమానాలు కల్గడానికి కారణం బిఆర్ఎస్ వ్యవహార శైలి,ఆ పార్టీ నాయకుల ప్రకటనలు,వ్యాఖ్యలు,చిట్ చాట్ లు.రేవంత్ ప్రభుత్వం ఎన్నో రోజులు మనజాలదని కేసీఆర్ 2024 మార్చి,ఏప్రిల్ ప్రాంతాల్లోనే అన్నారు.అప్పటికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి బహుశా నాలుగైదు నెలలే.120 లేదా 150 రోజుల్లోనే రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారంటూ మాజీ సీఎం కేసీఆర్ నిర్ధారించేశారు.ఇక ఇప్పుడు 15 నెలలు గడుస్తున్నాయి కనుక ‘కొసెల్లడాని’కి సంబంధించిన ‘డోసు’ పెంచారు.

‘‘దిక్కుమాలిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టే కర్మ మాకు లేదు.రేవంత్‌రెడ్డి చేస్తున్న లుచ్చా పనులకు జనమే రోడ్లమీదకు వచ్చి బంగ్లాదేశ్‌లో మాదిరిగా ప్రభుత్వాన్ని పడగొడతారు’’ అని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఏప్రిల్ 17 న ఒక ‘తీర్పు’ ఇచ్చారు. ”ఈ ఐదేళ్లు సీఎంగా రేవంతే ఉండాలని మేం కోరుకుంటున్నాం.ఆ తర్వాత ఎలాగూ మేం 20ఏళ్ల పాటు అధికారంలో ఉంటాం.సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఆత్మాభిమానం,పౌరుషం,సిగ్గుంటే రేవంత్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసేవారు”అని కూడా కేటీఆర్ అన్నారు. కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూముల్లో ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ భూమ్యాకాశాలను ఏకం చేస్తూ సాగిస్తున్న ప్రచారం ఆ పార్టీ మినహా మరెవరూ చేయలేరు.ఎర్రవల్లి యూనివర్సిటీ ‘ఉత్పత్తులే’ భిన్నమైనవి.జాతీయ,అంతర్జాతీయ స్థాయి సోషల్ మీడియా వ్యక్తులు,యూట్యూబర్లను ప్రభావితం చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ‘బజారు’కు ఈడ్వడంలో గొప్ప ప్రతిభను కనబరచారని ఆ పార్టీ భజన బృందాలు ప్రశంసిస్తున్నవి.

”తెలంగాణ పోలీసుల్లో కొంత మంది రేవంత్‌రెడ్డి ప్రైవేట్‌ సైన్యంలా పని చేస్తున్నారు.వారిపై సుప్రీంకోర్టుకు వెడతాం.కేంద్ర సాధికారిక కమిటీ నివేదిక ఆధారంగా సుప్రీం కోర్టు జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్‌ చేస్తున్నాం. ప్రధాని నిర్ణయంలో జాప్యం జరిగితే ఏప్రిల్‌ 27తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్దకు వెళ్లి ఆధారాలు అందిస్తాం”.అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించారు.అసలు పోలీసులను తమ పార్టీ కార్యకర్తలుగా ఎంతగా వాడుకున్నారో ‘ఫోన్ ట్యాపింగ్’ కేసుతో పాటు,2023 అసెంబ్లీ ఎన్నికల వేళ తమ పార్టీ అభ్యర్థులకు పోలీసు వాహనాల్లో డబ్బు పంపిణీ చేసిన తీరు… వంటి ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి.ఆయా కేసులపై విచారం జరుగుతోంది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమెరికాకు పారిపోయిన ఎస్.ఐ.బీ.మాజీ చీఫ్ ప్రభాకరరావు తెలంగాణకు వస్తే తప్ప నాటి ప్రభుత్వ ‘భాగోతం’ వెలుగులోకి రాదు.

అమెరికా నుంచి రాకుండా తప్పించుకోవడానికి సదరు ‘రావు’ అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నారు.క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాలో ఉన్నట్టు మొదట చెప్పారు.తర్వాత రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.అందుకు అమెరికా ఒప్ప్పుకోలేదు. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసి భంగపడ్డారు.ఈ లోగా కేంద్రప్రభుత్వం ఆయనకు ‘రెడ్ కార్నర్’ నోటీసులు జారీ చేసింది.తనను అరెస్టు చేయబోమని షరతుకు ఒప్పుకుంటే హైదరాబాద్ వచ్చి విచారణకు హాజరవుతానని హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు.అత్యంత కిరాతకమైన వ్యవస్థీకృత నేరంలో ప్రధాన నిందితునిగా ఉన్న వ్యక్తి ఇంత స్వేచ్ఛగా దాగుడు మూతలాడుతున్నారంటే ఖచ్చితంగా రాజకీయ,న్యాయపరమైన ‘సలహాలు’, సహకారం ఆయనకు అందుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

అలాగే తమ సామాజికవర్గానికి చెందని సమర్థులైన పోలీసు అధికారులను శంకరగిరి మాన్యాలకు ఎలా పంపారో,దిక్కూ దివాణం లేని పోస్టులకు బదిలీ చేశారో ‘తండ్రీ,కొడుకులకు’ తెలుసు.ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీ.జీ.శివధర్ రెడ్డి సహా పలువురు సీనియర్లు,తమకు నచ్చని వారు,తమకు అనుకూలంగా మసలుకోని సమర్థులను ఎలాంటి ‘లూప్ లైన్’ పోస్టింగ్ ఇచ్చారో పోలీసు శాఖకు తెలుసు.కనుక కొందరు పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రయివేటు సైన్యంలా పని చేస్తున్నారన్న విమర్శలు బిఆర్ఎస్ నాయకులనడం హాస్యాస్పదం. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు కొన్ని నెలలుగా ప్రచారం సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.బీఆర్ఎస్ నుంచి మరో 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు.కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా ఉన్నారు.మజ్లీస్ పార్టీ,కాంగ్రెస్ అవగాహనతో కలిసి వెడుతున్నవి.దాంతో కాంగ్రెస్‌ పార్టీ బలం దాదాపు 82 కు చేరుకుంది.ఈ సమయంలో బీఆర్ఎస్‌ కు చెందిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి.. ‘ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నాలు జరుగుతున్నాయ’ని హాట్‌కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.అసలు కాంగ్రెస్‌ సర్కార్‌ను బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు ఎందుకు పడగొట్టాలని భావిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.పైగా కొత్త ప్రభాకరరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవిగా బిఆర్ఎస్ నాయకత్వం ఖండిస్తుందని పలువురు ఆశించారు.కానీ స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ వ్యాఖ్యలను గట్టిగా సమర్ధించినందున ‘ప్రభుత్వాన్ని పడగొట్టే’ వ్యవహారం బిఆర్ఎస్ పాలసీగా అనుమానాలు గలుగుతున్నాయి.

”ఈ దరిద్రం ఇంకెంత కాలం.మీకు చాత కాకపోతే చెప్పండి.మేము చందాలు వేసుకుంటాం” అని ప్రజలు తనను కూడా కోరుతున్నట్టు రామారావు అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల బిఆర్ఎస్ పార్టీకి ఎంత పగ,కసి ఉన్నాయో తేటతెల్లమైంది.దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే,రేవంత్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు,బిల్డర్ల కోసం పని చేయాలా లేక ప్రజలకోసం పని చేయాలా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నవి.

”ప్రజా మద్దతుతో గెలిచినా ప్రభుత్వాన్ని కూలిస్తే జనం చూస్తూ ఊరుకోరు. అసలు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోవాలని కేసీఆర్ ఎందుకు కోరుకుంటున్నారో చెప్పాలి.16 నెలలుగా ప్రభుత్వం నడుస్తుంటే కాళ్లల కట్టెల అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు పారిశ్రామిక వేత్తల దగ్గర డబ్బు వసూళ్ల దందా కొత్త విషయమేమీ కాదు.అలా అక్కడ పైసలు తీసుకొని ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు” అని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా హెచ్చరించారు.”10 ఏళ్లు అధికారం అనుభవించిన కేసీఆర్‌ ఆ మత్తు నుంచి బయటపడలేక ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తున్నారు. ప్రతిసారి కేసీఆర్‌ నోటినుంచి వచ్చే మాటలు కొత్త ప్రభాకర్ రెడ్డి,కేటీఆర్ ల నోట వచ్చాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డనాటి నుంచి తండ్రి కొడుకులు కూల్చే కుట్రలు చేస్తున్నారు”అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు.ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకుని వెంటనే విచారణకు ఆదేశించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్‌ రెడ్డి కోరారు.

కేసీఆర్ ప్రభుత్వం గొప్పలకు పోయి సాగులో లేని భూములు, రాళ్లు,రప్పలు,గుట్టలు,రోడ్లు,పరిశ్రమలుగా రూపాంతరం చెందిన వాటికి,లే అవుట్లు వేసిన వాళ్లకు కూడా రైతు బంధు కింద డబ్బులు జమ చేసిన మాట నిజం.ఈ విధంగా 22,606 కోట్ల రూపాయలు దుర్వినియోగానికి గురయ్యాయి. గత ప్రభుత్వం మొత్తం 72,816 కోట్ల రూపాయలను రైతు బంధు పథకం కింద జమ చేయగా ఇందులో 22,606 కోట్ల రూపాయలు అయాచితంగా అనర్హులకు చేరాయి.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న గజ్వేల్ నియోజకవర్గంలో రాజీవ్ రహదారి,ఆమనగల్‌లో శ్రీశైలం రోడ్ల కింద పోయిన భూములకు కూడా రైతు బంధు పథకం కింద నిధులు అందాయని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నవి.కొన్ని చోట్ల క్రషర్లు,మరికొన్నిచోట్ల మైనింగ్ జరుగుతున్న భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు.గిరిజనులు,ఆదివాసీల పేర్ల మీద బీఆర్ఎస్ నాయకులు నకిలీ పాస్ పుస్తకాలను సృష్టించి రైతు బంధు కింద లబ్ది పొందినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2024 డిసెంబర్ అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు.”హైదరాబాద్‌కు చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో 70 నుంచి 80 శాతం వ్యవసాయం ఎవరూ చేయడం లేదు. వ్యవసాయ స్థలాలన్నీ రియల్ ఎస్టేట్‌గా,లే అవుట్లుగా, ప్లాట్లుగా మారాయి. ప్రతి సంవత్సరం కూడా రెండు సీజన్లకు కలిపి మూడు కోట్ల హెక్టార్లకు డబ్బులు ఇచ్చుకుంటూ పోయారు” అని సీఎం తెలిపారు.సీఎం రేవంత్ సూటిగా చేసిన విమర్శలు,ప్రభుత్వ గణాంకాలకు బిఆర్ఎస్ వైపు నుంచి తలా తోకా లేని జవాబులు వచ్చాయి.

కాగా ధరణి స్థానంలో తీసుకువచ్చిన భూభారతి చట్టంతో గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలోకి విసిరేశారు.కేసీఆర్ రద్దు చేసిన వీఆర్వో వ్యవస్థను రేవంత్ ప్రభుత్వం పునరుద్ధరించడం ఒక గుణాత్మక మార్పు.పలు వ్యవస్థల లాగానే కేసీఆర్ హయాంలో రెవెన్యూ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు.అయితే ఇలాంటి వ్యవస్థను రద్దు చేసినప్పుడల్లా ఆ ప్రభుత్వాలు మరల అధికారములోకి రాకుండా పడిపోయిన దాఖలాలు కళ్లగట్టినట్టుగా కనిపిస్తున్నాయి.రద్దయిన ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో ప్రజాపాలన ఆలోచనతో అధికారంలోకి రాగానే గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించిన ఘటనలున్నవి.

గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.గ్రామ రెవెన్యూ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ,ఓసిలలో వెనుకబడిన తరగతులు అత్యంత సంఖ్యలో ఉండి 95% శాతం ఓటు బ్యాంకు కలిగి వున్న వ్యవస్థ ఇది.రెవెన్యూ వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించారు.టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆత్మ గౌరవం లేని రెవెన్యూ శాఖకు పునర్జన్మనిచ్చిన మహానుభావుడుగా రేవంత్ రెడ్డిని విఆర్ఓలు ప్రశంసిస్తున్నారు.అసలు రెవెన్యూ శాఖనే లేకుండా చేయాలని కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేసినట్టు ఆరోపణలున్నవి.ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించడంలో మొదటి స్థానంలో నిలబడ్డ ఉద్యోగ సంఘాలు అందులో భాగంగా ఆనాటి ఉద్యమంలో పది జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు తాళాలు వేసిన ఘనత గ్రామస్థాయి ఉద్యోగులదే.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జపాన్ కు చెందిన పలువురు పారిశ్రామిక, వ్యాపారవేత్తలు ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి ఆశాజనకమైన వాతావరణం కనిపిస్తోంది.”దేశంలోనే కొత్త రాష్ట్రం.అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది.జపాన్‌ను ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు.మా ప్రభుత్వ నినాదం తెలంగాణ రైజింగ్.ఈ రోజు తెలంగాణ జపాన్‌లో ఉదయిస్తోంది.టోక్యో చాలా గొప్ప నగరం.ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతం.జపాన్ ప్రజలు సౌమ్యులు, మర్యాదస్తులు, క్రమశిక్షణ కలిగినవారు.మీ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను.హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నాను.ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల ప్రతిభ, స్థిరమైన విధానాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుందని జపాన్ వ్యాపారవేత్తలకు మాటిచ్చాను. లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, టెక్స్ టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని,భారత్, జపాన్ కలిసికట్టుగా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చినట్టు” సీఎం రేవంత్ తెలిపారు.దేశంలోనే మొదటి నెట్ జీరో ఇండస్ట్రియల్ సిటీగా హైదరాబాద్లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ, దేశంలోనే అద్భుతంగా నిర్మించ తలపెట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పై ప్రచార వీడియోలను రాష్ట్ర ప్రభుత్వం జపాన్ వేదికపై ప్రదర్శించింది.ఎలక్ట్రానిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, టెక్స్ టైల్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో జపాన్ కంపెనీలకు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, అవకాశాలను రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వివరించారు.

తోషిబా కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ టీటీడీఐ (ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చాయి.విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది. వీటితో పాటు పవర్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్‌గేర్ (జీఐఎస్) తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ఇప్పటికే అక్కడ ఉన్న ఫ్యాక్టరీలను అప్‌గ్రేడ్ చేయనుంది.ఈ ప్రాజెక్ట్ కు రూ. 562 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించే ఈ కొత్త ఫ్యాక్టరీ విద్యుత్ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.రుద్రారంలో ఇప్పటికే రెండు ఫ్యాక్టరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న టీటీడీఐ, ఈ కొత్త పెట్టుబడితో మూడో ఫ్యాక్టరీ నెలకొల్పనుంది. ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని విస్తరించనుంది. కొత్త పెట్టుబడులకు తోషిబా చేసుకున్న ఒప్పందం పారిశ్రామిక రంగంలో కొత్త ఉత్సాహమిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు తమను ఆకట్టుకున్నాయని,కొత్త ఆవిష్కరణల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చుతున్నాయని టీటీడీఐ చైర్మన్ హిరోషి ఫురుటా అన్నారు.