Prashant Kishor TRS : బీహార్ మెద‌డుకు ‘ప్ర‌గ‌తిభ‌వ‌న్ మేత‌

తెలంగాణ సీఎం కేసీఆర్ ను క‌లిసిన త‌రువాత `పీకే` మ‌నుసు మార్చుకున్నారా? కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పొత్తు బెడిసి కొట్ట‌డంతో కాంగ్రెస్ ను కాద‌నుకున్నారా? అంటే నిజం లేక‌పోలేద‌ని కొంద‌రు భావిస్తున్నారు

  • Written By:
  • Updated On - April 26, 2022 / 05:41 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ను క‌లిసిన త‌రువాత `పీకే` మ‌నుసు మార్చుకున్నారా? కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పొత్తు బెడిసి కొట్ట‌డంతో కాంగ్రెస్ ను కాద‌నుకున్నారా? అంటే నిజం లేక‌పోలేద‌ని కొంద‌రు భావిస్తున్నారు. దేశ‌, రాష్ట్ర స్థాయి స‌మీక‌ర‌ణాల‌ను మార్చేయాల‌ని ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌య‌త్నం చేశారు. ఆయ‌న గ‌త మూడు నెల‌లుగా మోడీకి ప్ర‌త్యామ్నాయం త‌యారు చేయాల‌ని చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. తొలుత బెంగాల్ సీఎం మ‌మ‌త‌తో గేమాడించారు. ఆ త‌రువాత యూపీయేలో భాగ‌స్వామిగా ఉన్న శ‌ర‌ద్ ప‌వార్ ను క‌లిశారు. ఆ సంద‌ర్భంగా యూపీయే మ‌నుగ‌డ‌లో లేద‌నే విష‌యాన్ని మ‌మ‌త ద్వారా ప్ర‌చారం చేయించారు.

కాంగ్రెస్ లేకుండా మోడీకి ప్ర‌త్యామ్నాయం క‌ష్ట‌మ‌ని భావించారు. అందుకే, కాంగ్రెస్ గూటికి చేరాల‌ని ప్ర‌య‌త్నం చేశారు. ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీతో మూడు రోజుల పాటు వ‌రుస‌గా ఇటీవ‌ల భేటీ అయ్యారు. సుమారు 600 స్లైడ్ ల‌తో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. నెహ్రూ కుటుంబం నుంచి నాయ‌క‌త్వాన్ని వికేంద్రీక‌రించాల‌నే కోణంలో ప‌లు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను చూపారు. ఏఐసీపీ అధ్య‌క్షునిగా నెహ్రూయేత‌ర కుటుంబాల‌ను నియ‌మించ‌డంతో పాటు ఒక బోర్డును ఏర్పాటు ద్వారా కీల‌క బాధ్య‌త‌ల‌ను రాహుల్ కు అప్ప‌గించాల‌నే ఒక ప్ర‌తిపాద‌న కూడా ఉంచారు. ఇలా ప‌లు ర‌కాల అభిప్రాయాల‌తో కాంగ్రెస్ పార్టీని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఆయ‌న ఇచ్చిన ప్ర‌తిపాద‌న‌ల‌పై అధ్య‌య‌నం చేయ‌డానికి సీనియ‌ర్ల‌తో కూడిన ఒక క‌మిటీనీ సోనియా నియ‌మించారు. ఆ క‌మిటీ నిచ్చిన నివేదిక ప్ర‌కారం ప్ర‌శాంత్ కిషోర్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాల‌ని ఆమె భావించారు.

సాధికారిక క‌మిటీని ఏర్పాటు చేసి దానిలో సీనియ‌ర్ల‌తో పాటు ప్ర‌శాంత్ కిషోర్ ను పనిచేయాల‌ని సూచించారు. కానీ, ఆ క‌మిటీతో క‌లిసి ప‌నిచేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని `పీకే` సున్నితంగా కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిర‌స్క‌రించారు. ఇదంతా అధికారికంగా బ‌య‌ట‌కు వ‌స్తోన్న న్యూస్. కానీ, కాంగ్రెస్ పార్టీతో ఆయ‌న భేటీలు అయిన త‌రువాత కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు కుద‌ర్చాల‌ని ప్ర‌య‌త్నించారు. ఆ మేర‌కు మూడు రోజులుగా ప‌లు విధాలుగా మీడియా క‌థ‌నాలు వ‌చ్చాయి. కానీ, కాంగ్రెస్ పార్టీ స‌సేమిరా అంటూ కేసీఆర్ తో పొత్తును నిరాక‌రించింద‌ని స‌మాచారం. ఆ విష‌యాన్ని ఏఐసీసీ తెగేసి చెప్పింద‌ని తెలుస్తోంది. అందుకే, రెండు రోజులుగా ప్ర‌గ‌తిభ‌వ‌న్లోనే ఉన్న ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాన్ని తిర‌స్క‌రించార‌ని స‌మాచారం.

సోనియా, కేసీఆర్ ను క‌లప‌డానికి చూసిన `పీకే` ఫెయిల్ అయ్యాడ‌ని తెలుస్తోంది. ఫ‌లితంగా కాంగ్రెస్ కు రాంరాం చెప్పిన ప్ర‌శాంత్ కిషోర్ ఇక నుంచి పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఆయ‌న స‌ర్వేల ప్ర‌కారం క‌నీసం 30 స్థానాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ గెల‌వ‌లేని ప‌రిస్థితిలో ఉంద‌ని సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది. అందుకే, కాంగ్రెస్ తో క‌లిసి న‌డ‌వాల‌ని కేసీఆర్ భావించిన‌ప్ప‌టికీ కుద‌ర‌లేద‌ని తెలుస్తోంది. ఇప్పుడు ఇక ప్ర‌శాంత్ కిషోర్ మార్క్ రాజ‌కీయ వ్యూహాలు తెలంగాణ రాష్ట్రంలో షురూ కాబోతున్నాయి.

ప్ర‌స్తుతం జ‌గ‌న్‌, మ‌మ‌త‌, కేసీఆర్ , స్టాలిన్, కేజ్రీవాల్ కు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా పీకే ఉన్నారు. వాళ్ల‌ను క‌లుపుకుని ప్ర‌త్యామ్నాయం త‌యారు చేయాల‌ని ఆయ‌న తాజా వ్యూహంగా ఉంద‌ని తెలుస్తోంది. యూపీయేను వ‌దులుకుని స్టాలిన్ వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌. ద‌క్షిణ భార‌త దేశంలో బ‌లంగా ఉండే కేసీఆర్, జ‌గ‌న్‌, స్టాలిన్ తో క‌లిసి రింగ్ తిప్ప‌డానికి అవ‌కాశాలపై అన్వేషిస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో జ‌గ‌న్‌, కేసీఆర్ కు వ్యూహ‌క‌ర్త‌గా పీకే వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. దీంతో మళ్లీ ఇరు రాష్ట్రాల మ‌ధ్య సెంటిమెంట్ చిచ్చు రాజేసేందుకు బీహార్ మెద‌డుకు పీకే ప‌దును పెడుతున్నాడ‌న్న‌మాట‌. ఇక కాస్కోండి తెలుగు ప్ర‌జ‌లారా!