Mallojula Venugopal Rao: తెలంగాణ వాస్తవ్యుడైన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోనూ భార్య తారక్క ఈ ఏడాది జనవరి 1వ తేదీనే లొంగిపోయారు. త్వరలోనే మల్లోజుల వేణుగోపాలరావు కూడా లొంగిపోతారనే ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలోనే తారక్క లొంగిపోయారు. ఆమె ప్రస్తుతం గడ్చిరోలిలోని పునరావాస శిబిరంలో నివసిస్తున్నారు. ఇటీవలే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరింత మంది మావోయిస్టులు త్వరలోనే లొంగిపోయే అవకాశం ఉందన్నారు. జనవరిలో తారక్క సరెండర్ కాగా.. త్వరలోనే ఆమె భర్త మల్లోజుల వేణుగోపాలరావు కూడా లొంగిపోతారనే కోణంలో ఈ వ్యాఖ్యలను చూడాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.
Also Read :Kavithas Letter: కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ.. పొలిటికల్ సిగ్నల్స్ ఇవేనా ?
ప్రస్తుతం అబూజ్‌మడ్ అడవుల్లో..
మల్లోజుల వేణుగోపాలరావు(Mallojula Venugopal Rao) సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ కూడా మావోయిస్టు కమాండర్‌గా పనిచేశాడు. ఆయన 2011లోనే కోల్‌కతాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. తాజా అప్‌డేట్ ఏమిటంటే.. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అడవుల్లో ప్రస్తుతం మల్లోజుల వేణుగోపాలరావు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఉన్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయని సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్ పూర్, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లో అబూజ్‌మడ్ అడవులు విస్తరించి ఉంటాయి. ఎలాగైనా మల్లోజుల వేణుగోపాలరావును పట్టుకోవాలనే లక్ష్యంతో ఈ అడవుల్లో భద్రతా బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ సరిహద్దుల్లో భద్రతా బలగాలు యాక్టివ్ మోడ్‌లో ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ కూడా ముగియడంతో మావోయిస్టుల ఏరివేతపై కేంద్ర సర్కారు పూర్తి ఫోకస్ పెట్టింది. మావోయిస్టు అగ్రనేతలపైనే ప్రధానంగా గురిపెట్టారు.
69 ఏళ్ల వయసులో మల్లోజుల వేణుగోపాలరావు
ప్రస్తుతం మల్లోజుల వేణుగోపాలరావు వయసు 69 ఏళ్లు. ఆయన తెలంగాణలోని పెద్దపల్లిలో జన్మించారు. బీకామ్ చేశారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టు పార్టీలో కీలక పాత్రలు పోషించారు. మావోయిస్టుల ఎలైట్ ఫోర్స్‌గా పేరొందిన సి-60కి ఆయన సారథ్యం వహించారు.