Ration Card KYC : రేషన్ కార్డులకు ఈ-కేవైసీ చేసుకునేందుకు తెలంగాణ ప్రజలు రేషన్ షాపుల ఎదుట బారులు తీరుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అన్ని జిల్లాల అధికారులు, తహసీల్దార్లకు ఆర్డర్స్ ఇచ్చారు. రేషన్ డీలర్ల దగ్గర రేషన్ కార్డుల ఈ-కేవైసీని అప్‌డేట్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ-కేవైసీ చేసుకోని వారి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగిస్తారని.. ఈ-కేవైసీ చేయించుకునే గడువు ఈనెలాఖరుతో ముగుస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజలు టెన్షన్ కు గురై రేషన్ షాపుల ఎదుట బారులు తీరుతున్నారు. వాస్తవానికి ఈ ప్రక్రియకు సంబంధించిన లాస్ట్ డేట్ ఎప్పుడు అనే దానిపై రేషన్ డీలర్లకు కానీ.. ఉన్నతాధికారులకు కానీ.. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇంకా క్లారిటీ లేదు.
Also read : NTR Ghat Issue : స్వర్గీయ ఎన్టీఆర్ పై మంత్రి కేటీఆర్ `షేడ్స్ `
కేవైసీ నిబంధనతో రాష్ట్ర ప్రజలు నష్టపోతారని పేర్కొంటూ మంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే కేంద్ర సర్కారుకు లేఖ రాశారు. రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఇతర దేశాలతో పాటు ఇతర నగరాలకు ఉపాధి కోసం వలస వెళ్లారని.. అలాంటి వారికి నష్టం జరగకుండా నిలువరించేందుకు ఈ-కేవైసీ ప్రాసెస్ పై పునస్సమీక్షించాలని కోరారు. గంగుల రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రిప్లై రాలేదు. ఈ-కేవైసీ ప్రాసెస్ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పిని క్రియేట్ చేసేలా ఉందనే ఆందోళన అధికార పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బోగస్ రేషన్ కార్డు లబ్ధిదారుల ఏరివేత కోసం ఈ-కేవైసీ చేపడుతున్నారు. అయితే ఉపాధి నిమిత్తం దూర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు వర్చువల్ గా ఈ-కేవైసీ చేసుకునే వెసులుబాటును కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇక వయసు పైబడిన ఈ-కేవైసీ కోసం రేషన్ షాపులకు రావడం కష్టతరంగా మారింది. అలాంటి వారికి కూడా వర్చువల్ గా కేవైసీని పూర్తి చేయడంపై ఫోకస్ చేయాలని ప్రజా సంఘాలు (Ration Card KYC) కోరుతున్నాయి.