KTR Vs Kavitha : ‘‘మీ వారసుడు ఎవరు ?’’ అని ఏడాది క్రితం ఓ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రశ్నించగా.. సూటిగా, సుత్తి లేకుండా ఈ సమాధానం ఇచ్చారు. ‘‘వారసులను నిర్ణయించే అధికారం ఎవరికీ ఉండదు. సమయం, సందర్భాన్ని బట్టి నాయకులు వాళ్లే తయారవుతారు. తయారు చేస్తే, నాయకులు తయారు కారు. నేను ఉద్దేశపూర్వకంగా ఏ నాయకులనూ తయారు చేయలేదు. వాళ్లంతా ఓ ప్రాసెస్‌లో ఎదిగిన వాళ్లే. బీఆర్ఎస్‌లో కేటీఆర్, హరీశ్ లాంటి నేతలు ఉన్నారు. వాళ్లలో ప్రతిభ ఉంటే, ప్రజలతో కలిసి పోతే నాయకులుగా ఎదుగుతారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్లే లీడర్లుగా జనాదరణ పొందుతారు. ప్రజలు, పార్టీ నాయకుల మద్దతు పొందే వాళ్లే నాయకులుగా నిలువగలరు’’ అని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇప్పుడు మనం కేసీఆర్ వ్యాఖ్యలను స్కాన్ చేద్దాం..
Also Read :AP Liquor Scam: ‘మ్యూల్ ఖాతా’లతో లిక్కర్ మాఫియా దొంగాట!
కవిత ఆసక్తిని అంచనా వేయలేకపోయిన కేసీఆర్
రాజకీయ వారసత్వం గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఒక విషయం స్పష్టమవుతోంది. కేటీఆర్, హరీశ్ రావులలో ఎవరైనా ఒకరు తన రాజకీయ వారసుడు అవుతారనే అంచనాలతో గులాబీ బాస్ ఉన్నారు. అయితే బీఆర్ఎస్ వారసత్వ పీఠంపై కల్వకుంట్ల కవిత(KTR Vs Kavitha)కు కూడా ఆసక్తి ఉందనే అంశాన్ని కేసీఆర్ గుర్తించలేకపోయారు. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అనూహ్య రాజకీయ సంక్షోభం ఏర్పడింది. మహిళలకూ సమాన అవకాశాల కోసం పోరాడుతున్న కాలమిది. అలాంటప్పుడు కవితకు కూడా బీఆర్ఎస్‌లో కేటీఆర్‌తో సమానమైన ప్రాధాన్యత దక్కాలని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్‌లో ఏర్పడిన విభేదాలు ఇంతటితోనైనా ఆగాలంటే కేసీఆర్ చొరవ చూపాలని వారు సూచిస్తున్నారు. కవితకు కూడా కేటీఆర్ (బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్) తరహా ప్రాధాన్యత కలిగిన పార్టీ పదవిని కేటాయించాలని అంటున్నారు.
Also Read :Jaggery vs Honey: తేనె, బెల్లం ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది.. దేని వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయో తెలుసా?
మూడు ముక్కలుగా బీఆర్ఎస్ ?
ఒకవేళ బీఆర్ఎస్‌లో కవితకు తగిన ప్రాధాన్యత దక్కకుంటే.. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ మూడు ముక్కలుగా చీలిపోయే ముప్పు ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కవిత వెంట వెళ్లేందుకు చాలామంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. తదుపరి రాజకీయ ప్రస్థానంలో ఆమెకు అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందించేందుకు వారంతా రెడీగా ఉన్నారట. ఈ సంక్షోభాన్ని అదునుగా చేసుకొని.. కొందరు బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్, బీజేపీలు తమ వైపు లాక్కునే అవకాశం ఉంది. చివరగా బీఆర్ఎస్ పార్టీ బలహీనపడొచ్చు. ఒకవేళ ఈ పరిణామాలే జరిగితే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను బీఆర్ఎస్ ఒంటరిగా ఢీకొనడం చాలా కష్టతరంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో బీజేపీతో చేతులు కలపాల్సి వస్తుంది.
త్వరలో కవితకు కీలక పదవి ?
కవిత సొంత రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకుంటే.. ప్రధానంగా బీఆర్ఎస్ ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. ఈ అంశాలన్నీ ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ అంచనా వేసి ఉంటారని రాజకీయ పండితులు చెబుతున్నారు. అందుకే ఇప్పట్లో కేటీఆర్‌ను తన రాజకీయ వారసుడిగా కేసీఆర్ ప్రకటించే అవకాశాలు లేవని అంటున్నారు. మొత్తం మీద ఇటీవలే కవిత రాసిన లేఖతో తన వారసుల ఎంపికపై కేసీఆర్ వ్యూహం మారి ఉంటుందని భావిస్తున్నారు. తన కూతురు కవిత బీఆర్ఎస్‌ను వీడాలని కచ్చితంగా కేసీఆర్ కోరుకోరు. అందుకే ఆయన వారసత్వం అనే తేనెతుట్టెను ఇప్పట్లో కదిపే అవకాశాలు ఉండకపోవచ్చు. రాబోయే రోజుల్లో కవితకు కీలకమైన పార్టీ పదవిని కేటాయించొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.