Telangana Politics: కాంగ్రెస్‌కు జగ్గారెడ్డి గుడ్ బై? అసలేం జరిగిందంటే!

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చాల రోజులుగా సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన కార్యక్రమాలు చూస్తే అర్ధమవుతోంది. పిసిసి చీఫ్ గా రేవంత్ నియామకం అవ్వడం ఇష్టంలేని జగ్గారెడ్డి అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్ ని ఎక్స్పోస్ చేసారు.

Published By: HashtagU Telugu Desk
Jagga Reddy Revanth reddy

Jagga Reddy Revanth reddy

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చాల రోజులుగా సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన కార్యక్రమాలు చూస్తే అర్ధమవుతోంది. పిసిసి చీఫ్ గా రేవంత్ నియామకం అవ్వడం ఇష్టంలేని జగ్గారెడ్డి అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్ ని ఎక్స్పోస్ చేసారు. రేవంత్ తీరు సరిగా లేదని, సీనియర్లని గౌరవించడం లేదని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని చాలా వేదికలపై బహిరంగంగానే ప్రకటించారు. రేవంత్ వల్ల పార్టీ నష్టపోతుందని, ఆయన్ని పక్కన పెట్టి వేరేవాళ్ళని అధ్యక్షుడిని చేయాలని కూడా డిమాండ్ చేసారు. రేవంత్ పద్ధతిపై ఏకంగా ఏఐసీసీకి లేఖ రాసారని గుసగుసలు వినిపించాయి.

ఎన్నిసార్లు చెప్పినా ఇటు రేవంత్ వినడం లేదు, అటు జాతీయ నాయకత్వం రెస్పాండ్ అవటం లేదని భావించిన జగ్గారెడ్డి రేపో, మాపో కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. శనివారం సంగారెడ్డి కార్యకర్తలతో సమావేశమై, సంచలన నిర్ణయం ప్రకటించే అవకాశమున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. శుక్రవారం తన ముఖ్య అనుచరులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారని, శనివారం మరోసారి సంగారెడ్డిలో కార్యకర్తతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించే అవకాశముందని దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశముందని తెలుస్తోంది.

శుక్రవారం నాడు ముఖ్యనేతలతో సమావేశమైన జగ్గారెడ్డి బావోద్వేగానికి లోనయ్యారని, తనవల్లే ప్రాబ్లమ్‌ అయితే వెళ్లిపోతానని, తనను కోవర్ట్‌ అని ప్రచారం చేస్తున్నారంటూ పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గత మంగళవారం సంగారెడ్డిలో జరిగిన ఒక సభలో పాల్గొన్న జగ్గారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పధకాలు బాగున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తాను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను అయినప్పటికీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రశంసిస్తున్నట్టు పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని ప్రశంసించడంపై మింగుడుపడని రాష్ట్ర నాయకత్వం ఆయనపై కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నట్లు, మంచి పనులు ఎవరి చేసినా మెచ్చుకోవడంలో తప్పేముందని జగ్గా రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇక కేసీఆర్ పుట్టినరోజున సందర్భంగా నిరసనలు చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు. దీనిపై రియాక్టయిన జగ్గారెడ్డి పుట్టినరోజు వేడుకలు వేరు, నిరుద్యోగ పోరాటం వేరని అభిప్రాయపడ్డారు. తాను కూడా సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నానని తెలిపారు. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్బంగా కాంగ్రెస్ నిరుద్యోగ సమస్యపై చేపట్టిన నిరసన తనకు తెలియదని జగ్గారెడ్డి మరోసారి బాంబ్ పేల్చారు.

దేశంలో ఎన్ని ఫ్రంట్‌లు వచ్చినా వాటికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు అవసరమని ఆయన అన్నారు. రాహుల్‌ గాంధీని ఉద్దేశించి అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్‌ స్పందించడంలో తప్పేమీ లేదని, గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబమని, అందుకే ఆ కుటుంబాన్ని విమర్శించినందుకు కేసీఆర్‌ స్పందించి ఉంటారని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.గాంధీ కుటుంబంతో దేశ ప్రజలకు రాజకీయ బంధం మాత్రమె కాకుండా రక్త సంబంధం లాంటి బంధముందని తెలిపిన జగ్గారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ త్యాగధనుల పార్టీ అని, పదవులను త్యాగం చేసి మన్మోహన్‌ను ప్రధానిని చేసిన ఘనత గాంధీ కుటుంబానిదని అయితే బీజేపీలో అద్వానీని ప్రధానమంత్రిగా చేయగలరా? విలువల్లేని బీజేపీకి కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే అర్హత లేదని పార్టీని వెనకేసుకొచ్చారు.

ఇక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంటికి వెళ్ళడం పట్ల కూడా జగ్గారెడ్డి రెస్పాండ్ అయ్యారు. వారిద్దరూ కలవడం పార్టీకి మంచి పరిణామమని, టీఆర్‌ఎస్, బీజేపీ సహా ఏ పార్టీ నేతలైనా కాంగ్రెస్‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదని, రాహుల్, ప్రియాంకలను ఎవరు విమర్శించినా కడిగి పారేస్తామని తెలిపిన జగ్గారెడ్డి తాజాగా పార్టీకి రాజీనామా ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. పార్టీకి రాజీనామ చేస్తే, ఆ తర్వాతఇండిపెండెంట్ గా ఉంటారా? లేదా ఆ పార్టీ నాయకుల్లో కొందరు ఆరోపిస్తున్నట్లు టీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్తారో చూడాలి. లేదా ఈలోపే తమ అధ్యక్షుడు రేవంత్ కలిసి జగ్గారెడ్డిని బుజ్జగించే చాన్స్ కూడా లేకపోలేదు. మరి ఏమవుతుందో చూద్దాం.

  Last Updated: 19 Feb 2022, 12:01 PM IST