Kavitha : తన గురించి ఓ తెలుగు పత్రికలో ప్రచురితమైన కథనాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెస్తా.. మంత్రి పదవి ఇస్తారా ?’’ అనే శీర్షికతో ఓ తప్పుడు కథనం సదరు పత్రికలో ప్రచురితమైందని కవిత తెలిపారు. ‘‘కాంగ్రెస్‌తో రాయబారం.. హస్తం గూటికి చేరేందుకు కవిత యత్నాలు’’ అనే శీర్షికతో ఒక కథనం, ‘‘సముచిత ప్రాధాన్యమిస్తే సరే.. కాదంటే కొత్త పార్టీ’’ అంటూ మరో కథనాన్ని కూడా ఆ పత్రిక ప్రచురించిందని కవిత వెల్లడించారు. ఈ కథనాల క్లిప్పింగులను తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో కవిత షేర్ చేశారు. అవన్నీ ఫేక్ అని కొట్టిపారేశారు. ఆయా క్లిప్పింగులపై ఫేక్ అనే లోగోను కవిత యాడ్ చేశారు. ఆ కథనాల్లో ఉన్నవన్నీ పచ్చి అబద్ధాలని కవిత(Kavitha) తేల్చిచెప్పారు. కనీసం తనను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా లేక శాడిజమా? అని ఆమె నిలదీశారు. కేసీఆర్‌తో తాడోపేడో తేల్చుకోవాలని కవిత అనుకుంటున్నారని ఆ కథనాల్లో ఉండటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎప్పటికీ తనకు ఆరాధ్యుడని తేల్చి చెప్పారు. అబద్దపు ప్రచారాలు చేస్తూ కొన్ని తెలుగు పత్రికలు జర్నలిజం ప్రమాణాలను దిగజారుస్తున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజల్లో వాటికి విశ్వసనీయత తగ్గిపోతుందన్నారు. కనీసం ఎదుటి వారి వివరణ తీసుకోకుండా ఈవిధమైన కథనాలను అల్లడం సరికాదని ఆమె హితవు పలికారు.
FAKE NEWS !!! pic.twitter.com/1GT2ERNmxL
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 29, 2025
Also Read :Weather Report : తీరం దాటనున్న వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు భారీ వర్షాలు
కవిత, కేసీఆర్, కేటీఆర్..
కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా?? శాడిజమా ? pic.twitter.com/kUESVnMDTF
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 28, 2025
బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్‌తో సమ స్థాయిని కవిత ఆశిస్తున్నారని, అలా జరగకపోవడంతో కొత్త పార్టీ ఏర్పాటుకు యత్నిస్తున్నారంటూ ఈమధ్య పలు తెలుగు పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చాయి. వాటిలో ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ కథనాల ప్రస్థానం.. కేసీఆర్‌కు కవిత లేఖ రాసిన తర్వాతే మొదలైంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విలేకరులతో కవిత మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చుట్టూ కొందరు దయ్యాలు ఉన్నారని కవిత అప్పట్లో కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని కొన్ని పత్రికలు కథనాలను అల్లుకున్నాయి. దీంతో ప్రజల్లోకి తీరొక్క రకాలుగా సందేశం వెళ్లింది. బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత, పదవుల కేటాయింపు, రాజకీయ వారసత్వం అంశం గురించి కవిత, కేసీఆర్, కేటీఆర్ ఒక చోట కూర్చొని గుట్టుగా చర్చించుకుంటే, ఇంత రాద్ధాంతం జరిగేదే కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.