తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చిన తమిళ సై అంటే మొదటి నుంచి సీఎం కేసీఆర్ కు అదో రకమైన వ్యతిరేక భావం ఉండేదని ఆ పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో ఉన్న నరసింహన్ అంటే ఆయనకు ప్రీతి. అందుకు సంబంధించిన పలు సంఘటనలు ఉన్నాయి. అనేక వేడుకల్లో వాళ్లిద్దరూ కలిసి సంతోషంగా ఉండేవాళ్లు. ఆనాడు ఉమ్మడి గవర్నర్ గా ఉన్నప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు కంటే తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే నరసింహన్ కు మహా ఇష్టమట. ఆ విషయం రాజ్ భవన్ వర్గాల్లో వినిపించేది. వేడుకల్లోనూ వాళ్లిద్దరి కదలికలు చాలా సాన్నిహిత్యంగా ఉండేవి. కానీ, తమిళ సై విషయంలో కేసీఆర్ కు భిన్నమైన పరిస్థితి ఉంది.గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే వైద్య, విద్య విభాగాల అధికారులతో నేరుగా తమిళ సై సమీక్షలు నిర్వహించారు. యూనివర్సిటీల వీసీల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ అనుమతిలేకుండా సంబంధింత శాఖల వివరాలను గవర్నర్ తెప్పించుకోవడం ఆనాడు హాట్ టాపిక్ అయింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం పని తీరు మెరుగు పర్చాలని చురకలు వేశారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సక్రమంగా అందచేయాలని పలు సందర్భాల్లో ఆమె ప్రభుత్వానికి సందేశం ఇచ్చింది.ఇలాంటి పరిణామాలతో రాజ్ భవన్ – ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగింది.
రాజ్ భవన్ కేంద్రంగా ఫిర్యాదులను సేకరించడానికి ప్రత్యేక బాక్స్ లను ఏర్పాటు చేసేలా తమిళ సై ఆదేశించింది. ఆ బాక్స్ ల్లోని ఫిర్యాదు ఆధారంగా ప్రజా దర్బార్ ను కొన్ని రోజులు నిర్వహించింది. గిరిజన ప్రాంతాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలోని సమస్యలపై అధ్యయనం చేసింది. ఒక డాక్టర్ గా కోవిడ్ సమయంలో నేరుగా ఆస్పత్రుల వ్యవహార శైలిని తప్పుబట్టింది. అక్రమాలకు పాల్పడుతోన్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పాలనలో తమిళ సై పాత్ర పెరుగుతూ వచ్చిందతి. అయినప్పటికీ కేసీఆర్ మౌనంగా పాలన సాగిస్తూ వెళ్లారు.హుజురాబాద్ ఉప ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా ఎంపిక చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు. ఆ మేరకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న ఫైల్ ప్రగతిభవన్ నుంచి రాజ్ భవన్ కు వెళ్లింది. కానీ, ఆమోదించే విషయంలోనూ గవర్నర్ కొంత ఆలస్యం చేసింది. దీంతో గవర్నర్ కోటాలో కాకుండా ఎమ్మెల్యే కోటాలో కౌశిక్ రెడ్డిని మండలికి ఎంపిక చేయాల్సిన పరిస్థితి కేసీఆర్ కు ఏర్పడింది. ఇటీవల రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసిన కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లి వినతి పత్రం ఇవ్వాలని తొలుత భావించారట. ఐతే చివరి నిమిషంలో రాజ్ భవన్ కు వెళ్లకుండా మంత్రులు, కొందరు నేతలతో మోమొరాండాన్ని పంపించారు. ఇక బల్దియా ఎన్నికల తర్వాత బీజేపీ నేతలు అనేక సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు అధికారులకు రాజ్ భవన్ కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఇలా ప్రభుత్వ విషయాల్లో గవర్నర్ నేరుగా జోక్యం చేసుకోవడం కేసీఆర్ కు ఏ మాత్రం నచ్చలేదట. దీంతో ప్రగతిభవన్, రాజ్ భవన్ మధ్య ఎడం పెరిగింది.ఇదంతా చూస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ తరహా రాజ్యాంగ యుద్ధం జరుగుతోందని అర్థం అవుతోంది. బెంగాల్ గవర్నర్ జవగదీప్ థాంకర్, సీఎం మమత మధ్య ఏర్పడి విభేదాలను చేశాం. ప్రస్తుతం ఎవరి ఎజెండాలతో వాళ్లు పాలన సాగిస్తున్నారు. అలాంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తోంది. గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్ ఎడమొఖం పెడమొఖంగా ఉన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ రిపబ్లిక్ డే వేడుక. ఆ రోజు రాజ్ భవన్లో జరిగిన వేడుకల్లో సీఎంగానీ, మంత్రులుగానీ కనిపించలేదు. పైగా ఆమె ప్రసంగంలో కేసీఆర్ సర్కార్ చేసిన అభివృద్ధికి బదులుగా మోడీ సర్కార్ నిర్ణయాలను ప్రస్తావించడం గమనార్హం. తెలంగాణ ప్రగతి నివేదికను కూడా ఆమె వినిపించలేదు.
రాజ్ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హాజరు కాలేదు. ఆ వేడుకలకు హాజరు కాకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని బీజేపీ మండిపడుతోంది. రిపబ్లిక్ డే రోజున గవర్నర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసినప్పటకీ సీఎం, మంత్రులు హాజరు కావడం ఆనవాయితీ. ప్రగతి భవన్‌లోనే ఉన్నప్పటికీ కూతవేటు దూరంలోని రాజ్‌భవన్‌కు సీఎం వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. అదే రోజు ప్రగతి భవన్లో కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించాడు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లోని అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి, నివాళులర్పించాడు. ఓమిక్రాన్ విజృంభణ ఉన్న కారణంగా పరిమిత సంఖ్యలోనే రాజ్ భవన్ వేడుకలకు ఏర్పాట్లు చేశారు.గత ఏడాది డెల్టా వేరియంట్ ఉన్నప్పటికీ పబ్లిక్ గార్డెన్‌లో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ రోజున సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యాడు. కానీ, ఈసారి రాజ్ భవన్ లో జరిగిన వేడుకలకు సీఎం, మంత్రులు డుమ్మా కొట్టడం పెద్ద హాట్ టాపిక్ అయింది. ప్రధాని మోదీ ఇటీవల కొవిడ్‌పై అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కూడా కేసీఆర్ గైర్హాజరు అయ్యాడు. ఇవన్నీ చూస్తూంటే..ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య బాగా తేడా వచ్చిందని స్పష్టం అవుతోంది. టీఆర్ఎస్ హత్యకు కుట్ర పన్నిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గవర్నర్ కు ఫిర్యాదు చేశాడు. దానిపై రాజ్యాంగ బద్ధంగా ఏమి చేయాలో..ఆ విధంగా తమిళ సై చేస్తున్నారు. ఇటీవల కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై కూడా నివేదికను కేంద్రానికి అందచేసినట్టు వినికిడి. ఇలా రాష్ట్రంలో జరుగుతోన్న బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ యుద్ధంలో రాజ్ భవన్ బీజేపీ వైపు ఉందని టీఆర్ఎస్ అనుమానం. అంతేకాదు, మొదటి నుంచి కేసీఆర్ పాలనపై ఏదో ఒక రకంగా జోక్యం, ఇప్పుడు రాజకీయంగా బీజేపీపై జరుగుతోన్న పోరాటంలోనూ తమిళ సై ప్రమేయం ఉందని ఆ పార్టీ పక్షాన నిలుస్తున్నారని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి.
సహజంగా ఆమె బీజేపీ నాయకులు. తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. గవర్నర్ గా ఎంపిక అయినప్పటికీ బీజేపీ భావజాలం ఉంటుందనేది కాదనలేని సత్యం. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ రాజకీయ నేపథ్యం ఉన్న కారణంగా ఆ కోణం నుంచి టీఆర్ఎస్ చూస్తోంది. అందుకే, ప్రగతిభవన్, రాజ్ భవన్ కు మధ్య గ్యాప్ ఏర్పడింది. బీజేపీయేతర రాష్ట్రాల్లోని సీఎంలకు గవర్నర్లకు మధ్య గ్యాప్ తరచూ పలు సందర్భాల్లో కనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గవర్నర్లుగా నియమించబడ్డ కిరణ్ బేడీ, మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ లు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారు. మొత్తం మీద గవర్నర్ల వ్యవస్థ మీద ఆనాడు ఎన్టీఆర్ తరహాలో కేసీఆర్ గళం ఎత్తనున్నాడని తెలుస్తోంది.