Modi and KCR: ‘మోడీ – కేసీఆర్’ మళ్లీ ఒక్కటవుతారా?

సీఎం కేసీఆర్ ఈసారైనా మోడీకి వెల్ కం చెబుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారుతోంది.

  • Written By:
  • Updated On - January 10, 2023 / 02:58 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) తెలంగాణలో పర్యటించబోతున్న విషయం తెలిసిందే. అయితే మోడీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పేరు కచ్చితంగా తెరపైకి వస్తోంది. గతంలో మోడీ పర్యటించిన సమయంలో సీఎం కేసీఆర్ (KCR) 5 సార్లు మోడీ పర్యటనకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ మోడీ తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారు. దీంతో కేసీఆర్ ఈసారైనా మోడీకి వెల్ కం చెబుతారా? లేదా? అనేది అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో ఆసక్తిగా మారుతోంది. అయితే నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ప్రధానమంత్రికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకుతూ వస్తున్నారు.

ప్రధానమంత్రి మాత్రమే కాదు, గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య టగ్ ఆఫ్ వార్ కనిపిస్తోంది. 2022 డిసెంబర్ చివరి వారంలో హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సమయంలో గవర్నర్, కేసీఆర్ (KCR) ఒకే ప్రేమ్ లో కనిపించినప్పటికీ, విందుకు మాత్రం దూరంగా ఉన్నారు. జనవరి 19న ప్రధాని రానుండటంతో సీఎం కేసీఆర్ ఘనస్వాగతం పలుకుతారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. అయితే మోడీ హైదరాబాద్‌-విజయవాడ మధ్య ‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీంతో పాటు తెలంగాణలో రూ.2,400 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని బీజేపీ వర్గాలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపాయి.

మోదీ రాష్ట్ర పర్యటన దృష్ట్యా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్‌కుమార్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్‌ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లి దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. దాదాపు రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణకు ప్రధాని  (PM Modi) శంకుస్థాపన చేస్తారని, కాజీపేట (Kazipet)లో పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ (పీఓహెచ్) వర్క్‌షాప్ నిర్మాణ పనులను రిమోట్‌గా ప్రారంభిస్తారని వెల్లడించారు. అదేవిధంగా రూ.1,231 కోట్లతో సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ పనులను కూడా ప్రారంభించనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.