Telangana vs BJP: ‘నిధుల’పై ప్రభుత్వాలు ఫైట్!

  • Written By:
  • Updated On - March 15, 2022 / 11:11 AM IST

దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలూ కేంద్రానికి సమానమే. అవసరాల ప్రాతిపదికన నిధులు కేటాయింపు ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ ఇందులో రాజకీయ జోక్యం పెరిగితే ఇబ్బందులే. ఇప్పుడు తెలంగాణకు కేంద్రం చేసిన కేటాయింపులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం నుంచి ఆశిస్తున్న గ్రాంట్ల విషయంలో తెలంగాణకు న్యాయం జరగడం లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఏడాదికి అందిన అత్యధిక మొత్తాన్ని చూస్తే.. రూ.15,450 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి ఆదాయం పెరగడంతో రాష్ట్రాలకు కూడా ఆ మేర కేటాయింపులు పెంచుతుందని తెలంగాణ ప్రభుత్వం కూడా అంచనా వేసింది. అందుకే 2021-22లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.38,669 కోట్లు అందుతాయని అంచనా వేసింది.

కానీ తరువాత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దానిని రూ.28,669 కోట్లుగా సవరించింది. కానీ ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన నిధులు కేవలం రూ.7,303 కోట్లు మాత్రమే. అంటే రూపాయి అడిగితే.. ఇచ్చింది పావలా అన్నమాట. తెలంగాణ సర్కారు మాత్రం తాజా బడ్జెట్ లో వేసిన అంచనాలను చూస్తే.. అవి రూ.41,001 కోట్లుగా ఉన్నాయి. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే 2022-23లో కేంద్రం నుంచి రాబోయే పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలిపి రూ.59,396 కోట్లుగా ప్రభుత్వం అంచనాలను తయారుచేసింది. కానీ దీనిని కూడా కేంద్రం ఆమోదిస్తుందే లేదో.. అసలు ఎంత మేర ఇస్తుందో కూడా లెక్కతేలని పరిస్థితి. అందుకే ఇప్పటికైనా తెలంగాణకు దక్కాల్సిన వాటాను, రావలసిన నిధులును వెంటనే ఇవ్వాలని కోరుతున్నారు.

ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వానికి, మోదీ సర్కారు మధ్య ఉప్పునిప్పు అనే పరిస్థితి ఉంది. కేంద్రం విధానాలపై కేసీఆర్ పోరాడుతున్నారు. ప్రతిపక్షాలను కలుపుకుని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నారు. దాని ద్వారా రాజకీయ పోరాటం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో నిధుల తగ్గింపు అంశం కూడా చర్చకు దారితీసింది.