Site icon HashtagU Telugu

Ali Khamenei : పాతబస్తీలో ఇరాన్ సుప్రీం లీడర్ పోస్టర్ల కలకలం

Iran Supreme Leader Posters

Iran Supreme Leader Posters

మొహర్రం నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీ(Old City)లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న సమయంలో నగరంలోని డబీర్‌పురా, దారుశ్శిఫా ప్రాంతాల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ, హిజ్బుల్లా రెండో నెంబర్ నేత హసన్ నస్రల్లా ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. “అంజుమన్-ఎ-మాసూమీన్” అనే సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు వివాదాస్పదంగా మారాయి. విదేశీ రాజకీయ నేతల ఫ్లెక్సీలు నగరంలో పెట్టడం, అదీ యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో, భద్రతాపరంగా కొత్త సమస్యలకు దారి తీసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

France : రఫేల్ పై చైనా ‘ప్రచార యుద్ధం’లోకి దిగిందా?.. ఫ్రాన్స్ సంచలన ఆరోపణలు

మొహర్రం వేడుకల నేపథ్యంలో పాతబస్తీలో బీబీ కా అలం ప్రదర్శన ఊరేగింపు జరుగుతోంది. ఈ ఊరేగింపు డబీర్‌పురా నుంచి ప్రారంభమై చార్మినార్, మదీనా, పతర్ గట్టి ప్రాంతాల మీదుగా చాదర్ ఘాట్ వద్ద ముగియనుంది. బీబీ కా అలం చూసేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 3,000 మంది పోలీసులు పాతబస్తీ ప్రాంతంలో మోహరించగా, విశేష భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ఇరాన్‌కు మద్దతుగా నగరంలో ఫ్లెక్సీలు పెట్టడం, ప్రజా ఊరేగింపు సమయంలో విదేశీ మత, రాజకీయ నేతల చిత్రాలను ప్రదర్శించడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతలు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఫ్లెక్సీలను తొలగించేందుకు చర్యలు ప్రారంభించారు. పోలీసులు ఈ చర్యపై విచారణ ప్రారంభించారని సమాచారం. భద్రతా దృష్ట్యా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులకు అవకాశం ఇవ్వకుండా మొహర్రం కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించాలని పోలీసు శాఖ కోరుతోంది.