IPL Betting: ఐపీఎల్ ‘బెట్టింగ్’ గుట్టు రట్టు!

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించినట్లు రాచకొండ పోలీసులు వివరాలను మీడియాకు తెలియజేశారు.

  • Written By:
  • Updated On - April 7, 2022 / 01:59 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ కొనసాగుతున్న తరుణంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించినట్లు రాచకొండ పోలీసులు వివరాలను మీడియాకు తెలియజేశారు. 56 లక్షల విలువైన సొత్తును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో సత్యనగర్ కాలనీలో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) దాడులు నిర్వహించి ఏడుగురు నిందితులను పట్టుకుని రూ.11.80 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. రెండు బ్యాంకు ఖాతాల్లో రూ.31 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ సందర్భంగా నిందితులు బెట్టింగ్ కోసం బుకింగ్‌ కార్యాకలాపాలను నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితులపై ‘తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4’ కింద కేసు నమోదు చేశారు. బుకీ తన్నీరు నాగరాజు, లైన్ ఆపరేటర్ గుండు కిషోర్, తన్నీరు అశోక్, చెమ్మేటి వినోద్‌తో పాటు పంటర్లు కోట్ల దినేష్ భార్గవ్, మేడిశెట్టి కిషోర్, బోజన రాజులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. అయితే నిందితులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే.

గతంలో 2016లో ఇదే కేసులో నాగరాజును వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. తన స్నేహితుడు కిషోర్‌, ఇద్దరు దూరపు బంధువులు అశోక్‌, వినోద్‌తో కలిసి బెట్టింగ్‌ రాకెట్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మ్యాచ్‌లో మొదటి బంతి తర్వాత ప్రారంభమైన బెట్టింగ్ చివరి బంతి వరకు సాగుతుంది. ఇది మ్యాచ్ పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో పంటర్లు బుకీలకు కాల్‌లు చేసి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. బుకీలు తమ కలెక్షన్ ఏజెంట్ల ద్వారా నగదు రూపంలో లేదా ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని యువతకు పోలీస్‌ కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు. కేసులు నమోదు చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని ఆయన హెచ్చరించారు.