KCR Interrogation: బీఆర్ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతా లోపం, ఆర్థిక అవకతవకలు, కాంట్రాక్టుల కేటాయింపుపై దర్యాప్తు కీలక దశకు చేరినట్టు సమాచారం. ఈ అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ జరుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు మే నెలాఖరుతో ముగియాల్సి ఉంది. అయితే కమిషన్ గడువును రేవంత్ సర్కారు మరో రెండు నెలలు (జూలై 31 వరకు) పొడిగించింది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను త్వరలోనే జస్టిస్ ఘోష్ కమిషన్ విచారిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. కేసీఆర్‌ను విచారించి వివరాలు రాబట్టిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ యోచిస్తోందట. కేసీఆర్‌తో పాటు గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లను కూడా కమిషన్ విచారించే అవకాశం ఉందట.
Also Read :Akash Anand : బీఎస్పీలోకి ఆకాశ్ ఆనంద్ ‘పవర్ ఫుల్’ రీఎంట్రీ.. ఎలా సాధ్యమైంది ?
త్వరలోనే కేసీఆర్‌కు సమన్లు ?
ఒక వ్యక్తిపై అభియోగాలను నమోదు చేసేటప్పుడు, వాటిపై సదరు వ్యక్తి వివరణ ఇచ్చుకోవడానికి అవకాశం కల్పించాలి అనేది సహజ న్యాయసూత్రం. దీన్ని అనుసరించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారణకు ఆహ్వానించి, ఆయన అభిప్రాయాలు, వివరణలు తీసుకుంటారని సమాచారం. త్వరలోనే కేసీఆర్‌కు(KCR Interrogation) జస్టిస్ ఘోష్ కమిషన్ సమన్లు పంపుతుందని అంటున్నారు. సమన్లు అందిన వారంలోగా విచారణకు హాజరుకావాలని కేసీఆర్‌ను కమిషన్ కోరే అవకాశం ఉంది.
Also Read :YS Jagan Vs Arrest : వైఎస్ జగన్‌కు అరెస్టు భయం పట్టుకుందా ? అందుకేనా ఈ ఏర్పాట్లు ?
గత విచారణల్లో ఏం జరిగిందంటే..
గతంలో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై విచారణ జరిపిన జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ కూడా కేసీఆర్‌కు సమన్లు పంపింది. అయితే విచారణ పూర్తికాకుండానే తనను దోషిగా ప్రకటించేలా జస్టిస్ నర్సింహారెడ్డి ప్రకటనలు చేస్తున్నారంటూ న్యాయస్థానాన్ని కేసీఆర్ ఆశ్రయించారు. దీనిపై అప్పట్లో స్పందించిన సుప్రీంకోర్టు.. జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి వ్యవహారశైలిపై అభ్యంతరాలు వ్యక్తం చేసి, ఆయన్ను విచారణ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత విద్యుత్ విచారణ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ నిర్మాణాలను సమర్థిస్తూ కేసీఆర్ రాసిన లేఖనే ఆయన అభిప్రాయాలుగా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఘోష్ కమిషన్ మరింత జాగ్రత్తగా కేసీఆర్‌కు తన వాదన వినిపించుకునే పూర్తి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.