Site icon HashtagU Telugu

TRS: ‘పాలేరు’ టీఆర్ఎస్‌లో వ‌ర్గ‌పోరు!

Paleru

Paleru

ఖ‌మ్మం జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు మాత్ర‌మే సాధించింది. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ త‌న హావాను కొన‌సాగించింది. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు టీఆర్ఎస్ నుంచి పోటీ చేయ‌గా.. కాంగ్రెస్ నుంచి కందాల ఉపేంద‌ర్ రెడ్డి పోటీ చేసి తుమ్మ‌ల‌పై గెలిచారు. ఆ త‌రువాత ఉపేంద‌ర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో అక్క‌డ రెండు వ‌ర్గాల మ‌ధ్య ఆదిప‌త్య పోరు న‌డుస్తుంది. ఇందుకు నియోజ‌క‌వ‌ర్గంలో ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే ఉదాహ‌ర‌ణ‌గా ఉన్నాయి. సొంత పార్టీలోనే త‌న‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. త‌న వ‌ర్గానికి చెందిన వారిపై అక్ర‌మ కేసులు పెట్టి వేధిస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు.

తాను ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై ఎక్క‌డా కూడా వివ‌క్ష చూప‌లేద‌ని.. చిల్ల‌ర వ్య‌క్తుల గురించి ఎవ‌రు ప‌ట్టించుకోవ‌ద్దంటూ ఆయ‌న కార్య‌క‌ర్త‌లకు పిలుపునిచ్చారు. పార్టీలో ఉన్నందున ఎవ‌రు తొంద‌ర‌ప‌డ‌వ‌ద్ద‌ని.. ఓపిక ప‌డితే కార్య‌క‌ర్త‌లే రాజుల‌వుతారంటూ ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. 2014 ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం జిల్లాలో త‌న హావా చూపిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో అధిష్టానం కూడా ఆయ‌న్ని ప‌క్క‌న పెట్టిన‌ట్లు తెలుస్తుంది. అయితే ఇటీవ‌ల ఆయ‌న పార్టీ మారుతారంటూ జోరుగా ప్ర‌చారం సాగినా దానిని తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఖండించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పాలేరు నుంచి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు పోటీ చేస్తారంటూ ఆయ‌న స‌న్నిహితులు చెప్తున్నారు.

ఇటు ఎమ్మెల్యే కందాల ఉపేంద‌ర్ రెడ్డి వ‌ర్గం మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేది త‌మ నేతే అంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు. దీనికి తోడు తుమ్మ‌ల వ‌ర్గంపై అక్ర‌మ కేసులు పెట్టి జైలుకు పంపించ‌డం మాజీ మంత్రి తుమ్మ‌ల‌కు మింగుడు ప‌డ‌టంలేదు. ఇదే విష‌యాన్ని ప‌లుమార్లు అధిష్టానం వ‌ద్ద కూడా తుమ్మ‌ల ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం. అయితే గ‌డిచిన నాలుగేళ్ల‌లో పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో విభేధాలు ఉన్న‌ప్ప‌టికీ అధిష్టానం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో తుమ్మ‌ల వ‌ర్గం అసంతృప్తిగా ఉంది. తాజాగా తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. విభేధాలు అధిష్టానం ప‌రిష్క‌రించ‌క‌పోతే మాజీ మంత్రి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది క్యాడ‌ర్‌లో ఉత్కంఠ నెల‌కొంది. మ‌రి చూడాలి టీఆర్ఎస్ అధిష్టానం ఈ ఇద్ద‌రి నేత‌ల్ని ఎలా స‌మ‌న్వ‌యం చేస్తుందో.