Telangana Congress : నల్గొండ జిల్లా పాలిటిక్స్ లో పైచేయి ఎవరిదో?

కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు లేకపోతే వింత కాని.. ఉంటే వింత కాదు. అందులోనూ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను విజయవంతం చేయడానికి వీలుగా..

Published By: HashtagU Telugu Desk
komati reddy revanth

komati reddy revanth

కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు లేకపోతే వింత కాని.. ఉంటే వింత కాదు. అందులోనూ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను విజయవంతం చేయడానికి వీలుగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా నల్గొండకు వెళ్లారు. అసలే అక్కడ ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్లిద్దరికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అలాంటప్పుడు రేవంత్ తన ఇలాఖాకు వస్తే ఊరుకుంటారా? అదే జరిగింది. అందుకే రేవంత్ మీటింగ్ కు డుమ్మాకొట్టి.. కేంద్రమంత్రి గడ్కరీ పర్యటనలో పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాకు వెళ్లకముందే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లాల్సిన అవసరం లేదని.. అక్కడ పార్టీని పటిష్టంగా ఉంచామని.. జానారెడ్డి, తాను పార్టీని చూసుకోగలమని.. తామే అక్కడ నాయకులమని చెప్పేశారు. మామూలుగా అయితే టీపీసీసీ సీట్లో వేరే నాయకుడు ఉండుంటే ఆ దెబ్బకు ఆగిపోయేవారు. కానీ రేవంత్ స్టైలే వేరు. అందుకే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వెళ్లారు. పైగా ఆ మీటింగ్ కు జానారెడ్డి కూడా హాజరయ్యారు. అంటే కోమిటరెడ్డిపై రేవంత్ పైచేయి సాధించారా?

రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా చేయడం కోమటిరెడ్డికి అస్సలు ఇష్టం లేదు. అందుకే అప్పుడే తన మనసులో మాటలు బయటపెట్టారు. తరువాత అధిష్టానం ఇద్దరికీ సర్దిచెప్పడంతో మళ్లీ రాజీకొచ్చారు. కానీ అది పైపైనే అని.. లోలోపల మాత్రం ఆధిపత్య పోరు కొనసాగుతోందని తాజా ఘటన రుజువు చేసింది. నిజానికి ఈనెల 27నే రేవంత్ నల్లగొండ జిల్లాకు వెళ్లాల్సి ఉంది. కానీ జిల్లాలో ఇద్దరు ఎంపీలున్నా వారికి చెప్పకుండా షెడ్యూల్ ఎలా తయారుచేశారన్న అభ్యంతరం వచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు ప్రచారం జరిగింది. అయినా ఆయన తెలివిగా ఈసారి జానారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సమావేశాన్ని ఏర్పాటుచేసుకున్నారు. దీంతో కోమటిరెడ్డి కూడా అంతే తెలివిగా మీటింగ్ కు రాలేనని చెప్పేశారు. సో.. ఇప్పటికైతే నల్గొండ రాజకీయాలపైనా రేవంత్ పట్టు సాధిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

  Last Updated: 30 Apr 2022, 01:14 PM IST