Janareddy : జానారెడ్డి నివాసంలో ఐటీ సోదాలు.. రాష్ట్రవ్యాప్తంగా 18 చోట్ల రైడ్స్

Janareddy : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి నివాసంలో గురువారం రాత్రి ఆకస్మికంగా ఆదాయపు పన్నుశాఖ (ఐటీ) దాడులు జరిగాయి.

  • Written By:
  • Publish Date - November 3, 2023 / 06:37 AM IST

Janareddy : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి నివాసంలో గురువారం రాత్రి ఆకస్మికంగా ఆదాయపు పన్నుశాఖ (ఐటీ) దాడులు జరిగాయి. ఈసందర్భంగా ఆయన కుటుంబం చేసే పలు వ్యాపారాలకు సంబంధించిన అకౌంట్స్‌తో ముడిపడిన పత్రాలను ఐటీ అధికారులు సేకరించారు.  హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి నివాసంలో ఈ సోదాలు జరిగాయి. ప్రత్యేకించి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి వ్యాపారానికి సంబందించిన లెక్క పత్రాల వివరాలను అధికారులు సేకరించినట్లు తెలిసంది.  మరోవైపు గురువారం రోజంతా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు టార్గెట్‌గా దాదాపు 18 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ సోదాలు చేశారని(Janareddy) తెలుస్తోంది.

  • గురువారం వేకువజామునే మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో పాటు అదే టికెట్‌ ఆశించిన బడంగపేట్‌ మేయర్‌ పారిజాత ఇళ్లలో ఐటీ రైడ్స్ జరిగాయి.
  • శంకర్‌పల్లి మండలం మాసానిగూడతో పాటు చేవెళ్ల మండలం తంగడపల్లి, శంషాబాద్‌ మండలం బహదూర్‌గూడలలో ఉన్న కేఎల్‌ఆర్‌ వ్యవసాయ క్షేత్రాలకు ఉదయం ఆరు గంటలకే ఐటీ అధికారులు చేరుకొని.. సోదాలు ప్రారంభించారు.
  • కోకాపేటలో నల్గొండ జిల్లాకు చెందిన ఒక కీలక కాంగ్రెస్‌ నేత బంధువు ఇంట్లోనూ సోదాలు జరిగాయి.
  • బాలాపూర్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు వంగేట లక్ష్మారెడ్డి ఇంటిలోనూ ఐటీ రైడ్స్ జరిగాయి.

We’re now on WhatsApp. Click to Join.

కేంద్రం సహకారంతో కేసీఆర్ చేయించిన దాడులివి  : రేవంత్ 

కాంగ్రెస్‌ నేతలను లక్ష్యంగా చేసుకొని ఐటీ రైడ్స్ చేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.  కేంద్ర దర్యాప్తు సంస్థలను కాంగ్రెస్ నేతలపైకి ఉసిగొల్పి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మహేశ్వరంలో సబితారెడ్డి ఓడిపోతున్నారని భయపడిన సీఎం కేసీఆర్‌.. కేంద్ర ప్రభుత్వం, పీయూష్‌ గోయల్‌ సహకారంతో కేఎల్‌ఆర్‌, పారిజాత నరసింహారెడ్డిల ఇళ్లలో ఐటీ సోదాలు చేయించారని ఆరోపించారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల నుంచి కేసీఆర్‌ను బీజేపీ పెద్దలే కాపాడుతున్నారని విమర్శించారు.