KCR Delhi : ఆ విధంగా ఢిల్లీ ముందుకు.!

``తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నాడు. ఎయిమ్స్ లో ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించుకుంటాడు. ఆ త‌రువాత వ‌రి ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రుల‌ను క‌లుస్తాడు...`` ఇదీ స‌ర్వ‌సాధారణంగా టీఆర్ఎస్ ఇచ్చే లీకులు.

  • Written By:
  • Publish Date - March 30, 2022 / 01:18 PM IST

“తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నాడు. ఎయిమ్స్ లో ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించుకుంటాడు. ఆ త‌రువాత వ‌రి ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రుల‌ను క‌లుస్తాడు…“ ఇదీ స‌ర్వ‌సాధారణంగా టీఆర్ఎస్ ఇచ్చే లీకులు. కానీ, కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన ప్ర‌తిసారీ `ముంద‌స్తు` అనుమానం రేకెత్తుతోంది. 2018 ఎన్నిక‌ల‌కు ముందుగా కూడా ఇలాంటి ఎపిసోడ్ నే కేసీఆర్ న‌డిపాడు. ఎలాంటి కార‌ణం లేకుండానే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఆనాడు వెళ్లాడు. కేవ‌లం విప‌క్షాలు నోరు మూయించ‌డానికి మాత్ర‌మే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళుతున్నాన‌ని అప్ప‌ట్లో చెప్పాడు. ఆనాడు ఆయ‌న ఎత్తుగ‌డ సానుకూల ఫ‌లితాల‌ను ఇచ్చింది. కానీ, ఈసారి కేంద్రానికి, కేసీఆర్ కు మ‌ధ్య గ్యాప్ ఉంది.2018 ఎన్నిక‌ల నాటికి బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య స‌హ‌జ మిత్ర‌త్వం కొన‌సాగింది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి రెండు పార్టీల మ‌ధ్య ఆనాడు ఉంది. ప్ర‌స్తుతం ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య విధాన‌ప‌ర‌మైన వైరం న‌డుస్తోంది. అదంతా బీజేపీ, టీఆర్ఎస్ గేమ్ గా కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేస్తోంది. ప్ర‌జ‌ల దృష్టిని కాంగ్రెస్ పార్టీ నుంచి మ‌ర‌ల్చ‌డానికి ఆ రెండు పార్టీలు గేమాడుతున్నాయ‌ని కాంగ్ లీడ‌ర్లు విశ్వ‌సిస్తున్నారు. అదే నిజం అయితే, కేసీఆర్ ఢిల్లీ టూర్ విజ‌యవంతం అయిన‌ట్టే.

పీకే ఇచ్చిన స‌ర్వే ప్ర‌కారం టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌తికూల వాతావ‌ర‌ణం రాష్ట్రంలో ఉంది. క‌నీసం 70 మందిని మార్చాల‌ని ఆయ‌న ఇచ్చిన స‌ర్వే సారంశమ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఇంకా పెరిగే అవకాశం ఉంద‌ని పీకే చెప్పాడ‌ని వినికిడి. అందుకే, గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌తో వెళ్లాల‌ని కేసీఆర్ యోచిస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఈ ఏడాది చివ‌ర్లో ఆ రెండు రాష్ట్రాల ఎన్నిక‌లు ఉన్నాయి. వ‌చ్చే ఏడాది మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ తో పాటు మ‌రికొన్ని రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌రిగాలి. వాటితో పాటు తెలంగాణ ఎన్నిక‌ల‌కు వెళ్లే కంటే గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు వెళ్లే ఆలోచ‌న కేసీఆర్ చేస్తున్న‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది.ఇదంతా త‌ర‌చూ జ‌రుగుతోన్న ప్రచారం. దీని కంటే రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల వ్యూహాల‌ను ర‌చించ‌డానికి కేసీఆర్ ఢిల్లీ కేంద్రంగా చ‌క్రం తిప్పుతున్నాడ‌ని స‌న్నిహితుల నుంచి అందుతోన్న స‌మాచారం. ఢిల్లీ వెళ్లిన ప్ర‌తిసారీ ఆయ‌న ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం పావులు క‌ద‌ప‌డానికి ప్ర‌య‌త్నం చేశాడ‌ని తెలుస్తోంది. గ‌త ఏడాది నెల రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నాడు. ఆ త‌రువాత రెండు వారాలు మ‌రోసారి ఒక వారం పాటు ఢిల్లీలో మ‌కాం వేశాడు. ఇటీవ‌ల మూడు రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా ఉన్నాడు. తాజాగా ఆయ‌న ఢిల్లీ వెళుతోన్న సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల వ్యూహం కోసమంటూ తెలుస్తోంది.

బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల గురించి మంగ‌ళ‌వారం చ‌ర్చ జ‌రిగింది. ఆ స‌మావేశానికి మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్‌, నడ్డా త‌దిత‌రులు హాజ‌రు అయ్యారు. అంబేద్క‌ర్ భ‌వ‌న్లో జ‌రిగిన ఆ స‌మావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫలితాలు, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల గురించి చ‌ర్చ జ‌రిగిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల వినికిడి. ఆ క్ర‌మంలో యూపీఏ, ఎన్డీయే ప‌క్షాల‌కు దూరంగా ఉండే టీఆర్ఎస్‌, వైసీపీ, బీజేడీ త‌దిత‌ర పార్టీల గురించి ప్ర‌స్తావన వ‌చ్చింద‌ని తెలుస్తోంది. రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ప్రాంతీయ పార్టీల ప్ర‌మేయం లేకుండా గెల‌వ‌డం క‌ష్టం. అందుకే, ఆయా పార్టీల‌తో బీజేపీ అగ్ర‌నేత‌లు భేటీ అవుతున్నారు. ఆ క్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని తెలంగాణ సీఎం క‌లిసే అవ‌కాశం లేక‌పోలేదు. మొత్తం మీద వ‌రి ధాన్యం కొనుగోళ్ల సంగ‌తి తేల్చేస్తానంటూ ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ భ‌విష్య‌త్ రాజ‌కీయానికి బాటలు వేసుకుంటున్నాడ‌ని అర్థం అవుతోంది. ముంద‌స్తును ముందు పెట్ట‌డం ద్వారా రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల వ్యూహాల‌ను కేసీఆర్ ర‌చిస్తున్నాడు. అవి ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో చూద్దాం.!