Jayalalitha Assets : జ‌య‌జ‌య‌హే..జేజే గార్డెన్‌!

జేజే గార్డెన్ భూముల వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత‌కు 15 ఎక‌రాల విస్తీర్ణంలో జేజే గార్డెన్ ఉంది. జీడిమెంట్ల రెవెన్యూ ప‌రిధిలో ఆ గార్డెన్ ఉంది. ఆమె మ‌ర‌ణం త‌రువాత ఆస్తుల వివాదాలు త‌మిళనాడుతో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో కూడా న‌డుస్తున్నాయి.

  • Written By:
  • Updated On - December 23, 2021 / 02:35 PM IST

జేజే గార్డెన్ భూముల వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత‌కు 15 ఎక‌రాల విస్తీర్ణంలో జేజే గార్డెన్ ఉంది. జీడిమెంట్ల రెవెన్యూ ప‌రిధిలో ఆ గార్డెన్ ఉంది. ఆమె మ‌ర‌ణం త‌రువాత ఆస్తుల వివాదాలు త‌మిళనాడుతో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో కూడా న‌డుస్తున్నాయి. అలాంటి వివాదాల్లో జేజే గార్డెన్ కూడా ఒక‌టి. ఆమె ఆస్తుల‌కు ఎవ‌రు వార‌సులు అనే దానిపై స్ప‌ష్ట‌త లేదు. చెన్నైలోని ఆమె నివాసం పొయెస్ గార్డెన్ తో స‌హా ప‌లు ఆస్తుల మీద హ‌క్కును ఎవ‌రూ క‌లిగి లేరు. అయితే, పోయెస్ గార్డెన్ తో పాటు జ‌య‌కు ఉన్న కొన్ని ఆస్థుల‌పై త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కొన్ని నిర్ణ‌యాల‌ను తీసుకున్నాడు.తెలంగాణ రాష్ట్రంలో స్వ‌ర్గీయ జ‌య‌ల‌లిత‌కు వివిధ రూపాల్లో ప‌లు చోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆమె చ‌నిపోయిన త‌రువాత జీడిమెట్ల‌, సికింద్రాబాద్ లోని జేజే గార్డెన్లతో పాటు శ్రీన‌గ‌ర్ కాల‌నీలోని ఇళ్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. ఈ ఆస్తుల‌పై కూడా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ క్ర‌మంలోనే సీఎం కేసీఆర్ త‌మిళ‌నాడు వెళ్లాడ‌ని సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఆ 15 ఎక‌రాల జేజే గార్డెన్ ను సొంతం చేసుకోవ‌డానికి స్టాలిన్ ను క‌లిశాడ‌ని సోష‌ల్ మీడియా పోస్టుల్లోని సారాంశం. ఇవ‌న్నీ నిజం కాద‌ని పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఒక టీఆర్ఎస్ కీల‌క నేత అన్నారు. ప్ర‌త్య‌ర్థులు కేసీఆర్ కు ఉన్న క్రేజ్ ను త‌గ్గించ‌డానికి చేసే జ‌మ్మిక్కుల‌ని ఆయ‌న కొట్టిపారేశారు.

Kcr Stalin Meet1

తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత జ‌రిగిన భూ కుంభ‌కోణాల తాలూకూ ప‌రిష్కారం ఏమిట‌ని ప్ర‌శ్నించే వాళ్లే లేకుండా పోయారు. తొలి రోజుల్లో మియాపూర్ భూ కుంభ‌కోణం పెద్ద ఎత్తున వెలుగు చూసింది. కొన్ని వంద‌ల ఎక‌రాల‌ను గోల్డ్ స్టోన్ ప్ర‌సాద్ ఆక్ర‌మించాడ‌ని కేసులు న‌మోదు అయ్యాయి. విచార‌ణ ఎక్క‌డ‌ వ‌ర‌కు వ‌చ్చిందో..ఎవ‌రికీ తెలియ‌దు. అలాగే ఎమ్మార్, ర‌హేజా పార్క్‌, హీరో నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్‌, వ‌క్ఫ్ బోర్డు భూ కుంభ‌కోణాలు, ఆక్ర‌మ‌ణ‌ల వ్య‌వ‌హారంపై కేసీఆర్ స‌ర్కార్ మౌనంగా ఉంది.క‌రుడుగ‌ట్టిన నేర‌స్తునిగా భావించిన న‌యీమ్ పోలీస్ ఎన్ కౌంట‌ర్ లో చ‌నిపోయాడు. ఆయ‌న క‌బ్జా చేసిన భూములు దాదాపుగా 1000 ఎక‌రాల‌కు పైగా ఉన్నాయ‌ని ఆనాడు విచార‌ణ సంద‌ర్భంగా వ‌చ్చిన వార్త‌లు. ఒక ఎక‌రం భూమిని కూడా ప్ర‌భుత్వం తిరిగి తీసుకోలేక పోయింది. ఏడేళ్ల కేసీఆర్ పాల‌న ఆద్యంత‌మూ భూ కుంభకోణాలు తెర‌మీద‌కు వ‌స్తూనే ఉన్నాయి. ఏ ఒక్క కేసుకు సంబంధించిన అంశం కొలిక్కి రాక‌పోగా, వివాద‌స్పదంగా ఉన్న భూములు ఎవ‌రి ఆధీనంలో ఉన్నాయో కూడా తెలియ‌దు.

A view of J. Jayalalithaa’s house now in the name of Sasikala Natarajan at Radhika Colony, West Marredpally (Photo: File)

ఉద్య‌మ స‌మ‌యంలో ఆంధ్రా వాళ్ల క‌బ్జాల్లో ఉన్న భూముల‌ను లాగేసుకుంటామ‌ని కేసీఆర్ హామీ ఇచ్చాడు. కొన్ని వంద‌ల ఎక‌రాల‌ను కొంద‌రు ఆంధ్రోళ్లు ఆక్ర‌మించార‌ని ప్ర‌చారం చేశాడు. ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నుతా అంటూ ఫిల్మ్ సిటీ మీద విరుచుప‌డ్డ కేసీఆర్ తానెప్పుడు ఆ మాట అన్నా..? అంటూ నాలుక మ‌డ‌తేశాడు. భూముల‌ను ఆక్ర‌మించుకుని హీరో నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ క‌ట్టాడ‌ని టీఆర్ఎస్ ఆరోపించింది. అయ్య‌ప్ప సొసైటీ భూములను తిరిగి తీసుకుంటామ‌ని ఆ పార్టీలోని కొంద‌రు హూంక‌రించారు.ఎమ్మార్, ర‌హేజా లాంటి భూ కుంభ‌కోణాల‌పై త‌ర‌చూ విప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి. ఇటీవ‌ల‌ కేటీఆర్ ఫాంహౌస్ భూముల మీద పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు చేశాడు. టీఆర్ఎస్ నేత మ‌ల్లారెడ్డి భూ ఆక్ర‌మ‌ణ‌ల గురించి కాంగ్రెస్ ప‌లుమార్లు ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్టింది. ఈ ఆరోప‌ణ‌ల‌కు సమాధానం చెప్ప‌డానికి ముందుకు రాలేని తెలంగాణ స‌ర్కార్ తాజాగా మాజీ మంత్రి ఈటెల భూ కుంభ‌కోణాన్ని బ‌య‌ట పెట్టింది. ఆ భూముల‌ను స్వాధీనం చేసుకోవ‌డానికి రీ స‌ర్వేను చేయిస్తోంది.

JJ Garden in Jeedimetla Owned By Jayalalitha (Photo: File)

తెలంగాణ‌లోని వివాద‌స్ప‌ద మియాపూర్, ఎమ్మార్, ర‌హేజా, న‌యీమ్, వ‌క్ఫ్ భూముల జాబితాలోకి జేజే గార్డెన్ కూడా వెలుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ భూముల వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డితేగానీ..వీటి వెనుకున్న భాగోతంతో పాటు ఎవ‌రి స్వాధీనంలో ఉన్నాయో తేలుతుంది. అప్ప‌టి వ‌ర‌కు ప‌లు ఆరోప‌ణ‌లు ప్ర‌భుత్వం మీద రావ‌డం స‌హ‌జం. వీటికి స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. వీటన్నింటి మీదా విచార‌ణ జ‌రుగుతోంద‌ని, చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుంద‌ని పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌ని టీఆర్ఎస్ కీల‌క నేత అంటున్నాడు. ఇలాంటి ఆరోప‌ణ‌ల‌తో కేసీఆర్ చ‌రిష్మాను ఎవ‌రూ త‌గ్గించ‌లేర‌ని ఆయ‌న అన్నారు.