Deputy CM Bhatti: పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధన సాధ్యమవుతుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Deputy CM Bhatti) అన్నారు. మంగళవారం గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ‘క్యాపిటల్ & ప్రొడక్టివిటీ ఫర్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ’ చర్చా గోష్టిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రైజింగ్ 2047.. భవిష్యత్తుకు ప్రతిజ్ఞ
రాబోయే 22 ఏళ్లలో 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఏకంగా 16 రెట్లు ఆర్థిక వృద్ధిని సాధించాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ లక్ష్య సాధనలో భాగంగానే తాము ‘తెలంగాణ రైజింగ్ 2047’ అనే విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించామని, ఇది కేవలం పత్రం కాదని మన భవిష్యత్తుకు ఇచ్చిన ప్రతిజ్ఞ అని ఆయన ఉద్ఘాటించారు. సాధారణంగా ఎక్కువగా పనిచేయడం, ఎక్కువ రోడ్లు, భవనాలు నిర్మించడంతోనే ఈ విప్లవాత్మక వృద్ధి సాధ్యం కాదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక సమీకరణాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుండి ‘ఈజ్ ఆఫ్ ఇన్నోవేటింగ్’ వైపు
ప్రపంచం మారుతున్న తీరును వివరిస్తూ గతంలో ప్రభుత్వాలు కేవలం రెగ్యులేటర్లుగా ఉండి అనుమతులు, లైసెన్సులపై దృష్టి పెట్టేవని ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ర్యాంకులు పెరిగితే సంతృప్తి చెందేవాళ్ళమని గుర్తుచేశారు. అయితే నేటి డీప్‌టెక్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ యుగంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనేది కేవలం కనీస అర్హత (బేస్‌లైన్) మాత్రమేనని స్పష్టం చేశారు. ఆసియాలో ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా తెలంగాణ ఎదగాలంటే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుండి ‘ఈజ్ ఆఫ్ ఇన్నోవేటింగ్’ వైపు సాగాలని, ఫైళ్లు క్లియర్ చేయడమే కాకుండా ఇన్నోవేషన్ ‘ఎకోసిస్టమ్‌లను క్రియేట్ చేసే’ ప్రభుత్వం కావాలని పేర్కొన్నారు.
Also Read: Sonia Gandhi : స్వరాష్ట్ర కలను సోనియా సాకారం చేశారు – రేవంత్
రిస్క్‌ను పంచుకునే ‘క్యాటలిస్ట్’గా ప్రభుత్వం
విజన్ డాక్యుమెంట్‌లో ప్రతిపాదించిన CURE (అర్బన్), PURE (పెరి-అర్బన్), RARE (రూరల్) అనే స్పేషియల్ స్ట్రాటజీని డిప్యూటీ సీఎం ప్రస్తావించారు. ఇన్నోవేషన్ ఖరీదైనదని, దానికి రిస్క్ ఉంటుందని, బ్యాంకులు సేఫ్టీని ఇష్టపడగా, ఇన్నోవేషన్‌కు మాత్రం వైఫల్యం అవసరమని తెలిపారు. అందుకే ప్రభుత్వం కేవలం రెగ్యులేటర్‌గా కాకుండా, రిస్క్‌ను పంచుకునే క్యాటలిస్ట్‌గా మారడానికి సిద్ధంగా ఉందని, ప్రజల కోసం రివార్డులు పొందే భాగస్వామిగా నిలబడుతుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
చర్చకు మూడు కీలక ప్రశ్నలు
తాను కేవలం మాట్లాడటానికి మాత్రమే కాకుండా ఈ అద్భుతమైన ప్యానెల్ అభిప్రాయాలను వినడానికి వచ్చానని తెలుపుతూ చర్చ కోసం మూడు కీలక ప్రశ్నలను సభికుల ముందు ఉంచారు. ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు తగ్గిపోతాయనే భయాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇన్నోవేషన్‌కు ప్రభుత్వం దూరంగా ఉండాలా? లేక ఇన్నోవేషన్‌లో భాగస్వామిగా ఉండాలా? ‘స్లో-మూవింగ్’ వ్యవస్థ అనే విమర్శలను ఎలా అధిగమించాలి? అనే అంశంపై మాట్లాడారు.
