తెలంగాణలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు అందించే ఇందిరమ్మ చీరల (Indiramma Sarees) పంపిణీ ఈసారి కూడా అనుమానంగానే ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేసేది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చీరల పంపిణీపై ఇంకా స్పష్టత రావడం లేదు. ప్రభుత్వం గతంలో చెప్పినట్లుగా మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు, అది కూడా మరింత నాణ్యతతో ఇస్తామని ప్రకటించినప్పటికీ, ఆ పంపిణీ ఎప్పుడు ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
Trump: భారత్‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన ట్రంప్!
బతుకమ్మ వేడుకలు సెప్టెంబర్ 21 నుండి 30 వరకు జరగనున్నాయి. అయితే ఈ లోపే తెలంగాణలో స్థానిక ఎన్నికలు కూడా జరగవలసి ఉంది. సెప్టెంబర్ 30 లోపు ఈ ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ రెండు వారాల ముందుగానే విడుదలయ్యే అవకాశం ఉంది, ఆ వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వస్తుంది. ఈ పరిస్థితుల్లో, ప్రభుత్వ పథకాల అమలుపై ఆంక్షలు ఉంటాయి కాబట్టి, ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడే అవకాశం ఉంది.
ఎన్నికల కోడ్ ప్రభావం వల్ల ఈసారి కూడా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఏడాది కూడా చీరల పంపిణీ జరగలేదు. ఇప్పుడు ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేయగలదా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేలోపు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయగలుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఆడబిడ్డలు మాత్రం ఈసారి చీరలు అందుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.