Site icon HashtagU Telugu

Indiramma Houses Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకం లభ్ధిదారులకు బిగ్ అలెర్ట్…. ఇలా చేస్తే అంతే సంగతి??

Indiramma Houses Scheme

Indiramma Houses Scheme

తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. తొలిదశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో ఈ పథకం ప్రారంభమైంది. ఈ క్రమంలో, తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక్క గ్రామం చొప్పున 71,482 మంది లబ్ధిదారులకు ఇప్పటికే మంజూరు పత్రాలు అందించారు. ఆ లబ్ధిదారుల ఇళ్ల గ్రౌండింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా కూడా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలోని లబ్ధిదారులకు వేగంగా బిల్లులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం మొత్తం నాలుగు విడతల్లో డబ్బులు ఇవ్వనుండగా, పునాది స్థాయికి చేరిన ఇళ్ల వివరాలను గృహనిర్మాణ శాఖకు పంపిస్తే, తక్షణమే రూ.లక్ష చెల్లించాలని సూచించారు. అదే సమయంలో, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం కఠిన వైఖరితో ముందుకు సాగుతుంది.

ఈ పథకానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇంటి నిర్మాణం వివిధ దశలలో ఉన్నప్పుడు ఆ యాప్‌లో వివరాలు అప్‌డేట్ చేయబడతాయి. నిర్మాణంలో ఉన్న ఇంటి లోకేషన్ కూడా యాప్‌లో రికార్డ్ చేయబడుతుంది. అలా ఏదైనా అవకతకలు ఉంటే, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం బిల్లులు నిలిపివేయబడతాయి. అలాగే, ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు తప్పనిసరిగా 400 చదరపు అడుగుల విస్తీర్ణం లేదా అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించాల్సి ఉంటుంది.

బేస్‌మెంట్ పూర్తయిన తర్వాత, ఇంటి నిర్మాణానికి సంబంధించిన కొలతలను పక్కాగా చెక్ చేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనాధికారులు కొలతలను చూసి, ఫొటోలు తీసి, యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. వాటిని పై అధికారులు మరోసారి చెక్ చేసి, బిల్లుల చెల్లింపునకు అనుమతి ఇవ్వనున్నారు. నిర్ణీత కొలతలు లేని ఇళ్ల బిల్లులు తిరస్కరణకు గురవుతాయి.

ఏఈలు బేస్‌మెంట్‌ వరకు పూర్తయిన ఇళ్లను పరిశీలించి, వాటి కొలతలు సరిగా ఉంటేనే ఫొటో అప్‌లోడ్ చేస్తారు. డీఈలు సూపర్‌చెక్ చేసి, సరిగా ఉంటే బిల్లుల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్‌ ఇస్తారు. నిర్ణీత కొలతల ప్రకారం లేని ఇళ్లను నిరభ్యంతరంగా తిరస్కరిస్తారు.

ఇదిగో, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులు వారి అప్లికేషన్ స్థితిని https://indirammaindlu.telangana.gov.in వద్ద ట్రాక్ చేసుకోవచ్చు. దీంతో, దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, తమ అప్లికేషన్ స్టేటస్, ఇల్లు మంజూరు అయిందా? లేదా? అనే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.