Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల స్కీంకు లబ్ధిదారుల ఎంపిక కోసం శరవేగంగా సర్వే జరుగుతోంది. సర్వే ద్వారా సేకరిస్తున్న సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. సర్వే ప్రక్రియ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వేగంగా జరుగుతోంది. ఇంకొన్ని జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 80.54 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇప్పటివరకు రాష్ట్రంలోని 31.58 లక్షల మంది దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Houses) యాప్ ద్వారా సర్వే చేశారు. ఈ సర్వేను సంక్రాంతిలోగా పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. మొత్తం మీద ఇప్పటివరకు జరిగిన సర్వేలో గుర్తించిన కీలకమైన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Also Read :Formula E Race Case : ఆ ఇద్దరి వాంగ్మూలాలను సేకరించాకే కేటీఆర్ విచారణ ?
సర్వేలో గుర్తించిన అంశాలు..
- ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజల నుంచి వచ్చిన 80.54 లక్షల దరఖాస్తుదారుల్లో 9.19 లక్షల మందికి మాత్రమే సొంత స్థలాలు ఉన్నాయి.
- ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసి సొంత స్థలం కలిగిన వారిలో 2.35 లక్షల మంది పెంకుటిళ్లలో ఉంటున్నారు. 2.17 లక్షల మంది సిమెంట్ రేకుల ఇళ్లలో ఉంటున్నారు. 1.86 లక్షల మంది జీఐ రేకుల ఇళ్లలో నివసిస్తున్నారు. 1.22 లక్షల మంది శ్లాబ్ ఇళ్లలో ఉంటున్నారు. 69,182 మంది మట్టి మిద్దెల్లో ఉంటున్నారు. 41,971 మంది ప్లాస్టిక్ కవర్లు/టార్పాలిన్లతో కప్పిన ఇళ్లలో నివసిస్తున్నారు. 34,576 మంది గడ్డితో ఏర్పాటుచేసుకున్న గుడిసెల్లో తలదాచుకుంటున్నారు. 12,765 మంది పెంకులు పగలడంతో టార్పాలిన్ కవర్లు కప్పిన ఇళ్లలో నివసిస్తున్నారు.
- ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడతలో సొంతస్థలాలు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారు. తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నారు.
- రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో 59 శాతం సర్వే పూర్తయింది. యాదాద్రి-భువనగిరి, జనగామ, జగిత్యాల జిల్లాల్లో 58 శాతం సర్వే జరిగింది.
- హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లో 30 శాతంలోపే సర్వే జరిగింది.
- జీహెచ్‌ఎంసీలో 7 శాతం మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ ఏరియాలో ప్రజాపాలన దరఖాస్తులు 10.70 లక్షలు వచ్చాయి. ఇప్పటివరకు 74,380 మంది ఇళ్లకు సర్వేయర్లు వెళ్లారు.