Site icon HashtagU Telugu

Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులకు గుడ్‌న్యూస్‌.. ఇంటి డిజైన్‌ మీకు నచ్చినట్టే..!

Indiramma Illu

Indiramma Illu

Indiramma Illu : ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద లబ్ధిదారులకు ప్రభుత్వాన్ని ఆశ్రయించి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయం విదితమే. ఈ మొత్తం నాలుగు విడతల్లో చెల్లించనుండగా, లబ్ధిదారులు ఇళ్లను పూర్తిగా నిర్మించుకునేందుకు అనువుగా నాలుగు కొత్త నిర్మాణ పద్ధతులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఖర్చు తగ్గించుకునే వీలుండేలా, లబ్ధిదారులు ఈ పద్ధతులను స్వేచ్ఛగా ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

ప్రస్తుతం పిల్లర్లు, బీములతో కూడిన సాధారణ నిర్మాణ శైలిని తప్పనిసరి కాకుండా, తక్కువ ఖర్చుతో ఇంటిని పూర్తి చేసుకునేలా నాలుగు నమూనాలను ప్రభుత్వం రూపొందిస్తోంది. ప్రతి మండలానికి ఒక నమూనా ఇంటిని మోడల్‌గా నిర్మించి, లబ్ధిదారులకు ప్రాథమిక అవగాహన కల్పించనున్నారు. అంతేకాదు, వీలైనంత మంది మేస్త్రీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారు ఈ కొత్త పద్ధతులను అమలు చేయగలిగేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ నెల 28 నుంచి జిల్లాల్లో న్యాక్ సెంటర్లలో నిపుణుల ఆధ్వర్యంలో మేస్త్రీలకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. తద్వారా లబ్ధిదారులు అనుకూలంగా అనిపించే శైలిని ఎంచుకొని, తక్కువ ఖర్చుతో నిర్మాణాన్ని పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్‌లో ఇంటి విస్తీర్ణం 400 చదరపు అడుగుల కంటే తక్కువ కాకూడదనే నిబంధన ఉంది. అయితే, నిర్మాణ ఖర్చులు అధికమై, లబ్ధిదారులు ఇంటిని అసంపూర్తిగా వదిలేయకుండా ఉండేందుకు, గరిష్టంగా 600 చదరపు అడుగుల పరిమితిని నిర్ణయించారు.

God Chip : ప్రపంచాన్ని మార్చేసే ‘గాడ్  చిప్‌‌’.. ఏం చేస్తుందో తెలుసా ?

నాలుగు నిర్మాణ పద్ధతులు

షార్ట్ కాలమ్ కనస్ట్రక్షన్: స్టీల్ వ్యయం తగ్గించేందుకు, పునాదుల స్థాయిలో మాత్రమే కాలమ్స్ ఉంటాయి. ప్లింథ్ బీమ్స్ పై కాంక్రీట్ గోడలు నిర్మిస్తారు. పైఅంతస్తులు అవసరం లేని ఇళ్లకు అనువైన మోడల్.

షియర్ వాల్ పద్ధతి: ప్రీఫ్యాబ్రికేటెడ్ గోడలను ముందుగానే తయారు చేసి, నిర్మాణ స్థలంలో అనుసంధానం చేస్తారు. ఇటుక, స్టీల్ అవసరం లేకుండా గోడలు, పైకప్పు వేయవచ్చు.

స్టోన్ రూఫింగ్ విధానం: కాంక్రీట్ గోడలపై ఆర్సీసీ రాఫ్టర్స్ అమర్చి, వాటిపై షాబాద్ బండలు పరుస్తారు. తక్కువ మందంలో కాంక్రీట్ పొర వేసి, స్థాయిని పెంచుతారు. షాబాద్ బండలు లభించే ప్రాంతాల్లో ఇది ఆర్థికంగా లాభదాయకం.

పిల్లర్ రూఫింగ్ నిర్మాణం: గోడలపై ఆర్సీసీ రాఫ్టర్లు అమర్చి, బెంగళూరు పెంకులు అమరిస్తారు. పెంకులపై పలచని కాంక్రీట్ స్లాబ్ వేస్తారు. ఇటుక, స్టీల్ ఖర్చులను గణనీయంగా తగ్గించవచ్చు.

లబ్ధిదారులకు లాభాలు

ఈ కొత్త నిర్మాణ నమూనాలు, ప్రభుత్వం అందించే రూ. 5 లక్షలతో ఇంటిని పూర్తి చేసుకునేందుకు సహాయపడతాయి. ఇంటి నిర్మాణంలో తక్కువ ఖర్చు చేయాలనుకునే వారు, ఈ మోడళ్లను పరిశీలించి, అవసరాన్ని బట్టి ఎంచుకోవచ్చు. మోడల్ ఇండ్లు, మేస్త్రీల శిక్షణతో, లబ్ధిదారులు తక్కువ ఖర్చులో నాణ్యమైన ఇంటిని నిర్మించుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పద్ధతులతో ఇండ్ల నిర్మాణం వేగవంతమయ్యే అవకాశం ఉండటంతో, ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ మరింత ప్రజాదరణ పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం, పేదల ఆవాస కలను త్వరగా నెరవేర్చే మార్గంలో కీలక మైలురాయి అవుతుందని చెప్పడంలో సందేహం లేదు.

Australia Vs England: ఇదేం ఆట‌.. 351 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించిన ఆసీస్‌!