Site icon HashtagU Telugu

Indira Shoban: ఆమ్ ఆద్మీకి ‘ఇందిరా శోభన్’ గుడ్ బై.. వాట్ నెక్ట్స్?!

Indira Shoban

Indira Shoban

ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సెర్చ్ కమిటి ఛైర్మెన్ ఇందిరా శోభన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు పంపారు. కాగా సామాన్యుల పార్టీ అని చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఓ పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించి ఆప్ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చిందని ఆమె ఆరోపించారు. బిఆర్‌ఎస్ పార్టీ నిర్ణయాలకు కేజ్రీవాల్ వత్తాసు పలకడంతో తాను మనస్థాపానికి గురైనట్లు ఇందిరా శోభన్ తెలిపారు.

ఖమ్మం బిఆర్‌ఎస్ సభకు వచ్చినప్పుడే కేజ్రివాల్ ముందు తన సందేహాన్ని ఉంచానని ఈ రోజు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బిఆర్‌ఎస్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బహిష్కరించడాన్ని ఆమె తప్పుపట్టారు. అంబేద్కర్ ఫోటో పెట్టుకునే కేజ్రీవాల్ రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించి ఆ పదవిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తానన్న బిఆర్‌ఎస్‌తో కలిసి ఈ దేశ ప్రజలకు కేజ్రీవాల్ ఏం సంకేతాలు ఇవ్వదల్చుకున్నారని ఇందిరా శోభన్ నిలదీశారు.

ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశానని, త్వరలోనే భవష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె చెప్పారు. కాగా కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఇందిరా శోభన్ .. ఇటీవల వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీలో చేరారు. అయితే కొద్ది రోజులకే ఆ పార్టీని వీడిన ఇందిరా శోభన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. తాజాగా ఈ పార్టీకి కూడా ఆమె గుడ్ బై చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పడంతో మళ్లీ సొంత పార్టీ కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ లో ఇమడలేక బయటకొచ్చిన ఆమెకు టీడీపీలోనూ చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజా రాజీనామాతో వైస్సార్ తెలంగాణ పార్టీ నేతలు కూడా ఇందిరా శోభన్ మళ్లీ ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

Exit mobile version