Site icon HashtagU Telugu

Hyderabad : హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఏమైందంటే?

IndiGo

IndiGo

Hyderabad : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానం(6ఈ 7308)లో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో ఆ విమానాన్ని అకస్మాత్తుగా మార్గం మధ్యలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌‌లో ల్యాండ్ చేయించారు. ఆ వెంటనే ప్రయాణికులందరినీ బయటికి పంపి, విమానాన్ని ముమ్మరంగా తనిఖీ చేశారు. కానీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. తనిఖీలు జరుగుతున్న క్రమంలో ఆ విమాన ప్రయాణికులకు టిఫిన్ ఏర్పాట్లు చేశారు. అనంతరం విమానం నాగ్‌పూర్ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు(Hyderabad) చేరుకుంది. ఈ ఘటన వల్ల ప్రయాణికుల విలువైన  సమయాన్ని నష్టపర్చినందుకు క్షమాపణలు చెబుతూ ఇండిగో ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల భద్రత కోసమే తాము అకస్మాత్తుగా తనిఖీలు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.

We’re now on WhatsApp. Click to Join

విమానాలు, ఆస్పత్రులు, పాఠశాలలకు ఈవిధంగా బూటకపు బాంబు బెదిరింపులు రావడం ఇటీవల కాలంలో బాగా  పెరిగిపోయింది. జూన్ 18న జైపూర్, చెన్నై, వారణాసి సహా 41 విమానాశ్రయాలకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.  దీంతో అప్పట్లో విమాన సర్వీసులను ఆపేసి.. గంటల తరబడి విస్తృతమైన తనిఖీలు నిర్వహించారు. చివరకు ఆ బాంబు బెదిరింపులన్నీ బూటకమని వెల్లడైంది. ఇలాంటి బెదిరింపులు వచ్చినప్పుడు విమానం తనిఖీ, ప్రయాణికుల లగేజీల తనిఖీల చాలా సమయమే పడుతుంది. పేలుడు పదార్థాలు ఏవీ లేవు అని నిర్ధారించుకున్న తర్వాతే .. బెదిరింపు వచ్చిన విమానాన్ని ప్రయాణానికి అనుమతిస్తారు. ఇలాంటి బెదిరింపులు పంపేవాళ్లు దొరికితే కఠిన శిక్షలు పడతాయి.

Also Read :Uddhav Thackeray : మోడీ క్షమాపణల్లో అహంకారం.. శివాజీని అవమానించినందుకు ఓడిస్తాం : థాక్రే

  • ఆగస్టు 22న ఒక విమానం ముంబై నుంచి  కేరళలోని తిరువనంతపురానికి బయలుదేరింది. అయితే ఆ విమానంలో బాంబు ఉందంటూ కొందరు ఈమెయిల్ వార్నింగ్స్ పంపారు. దీంతో తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం దిగగానే దాన్ని తనిఖీ చేశారు.
  • జూన్ 17న ఢిల్లీ  నుంచి దుబాయ్‌కు వెళ్లే విమానంలో బాంబు పెట్టామని ఈమెయిల్ వచ్చింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఓ 13 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.అతడిని విచారిస్తే టైం పాస్ కోసం, ఆటపట్టించేందుకు బెదిరింపు ఈమెయిల్ పంపానని చెప్పాడు.