New Virus In Hyderabad : హైద‌రాబాద్ లో కోవిడ్ కొత్త వైర‌స్ ద‌డ‌

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని క‌రోనా కొత్త వేరియెంట్ వ‌ణికిస్తోంది. ఆల‌స్యంగా బీఏ-4 వేరియెంట్ బ‌య‌ట ప‌డింది.

  • Written By:
  • Updated On - May 20, 2022 / 02:26 PM IST

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని క‌రోనా కొత్త వేరియెంట్ వ‌ణికిస్తోంది. ఆల‌స్యంగా బీఏ-4 వేరియెంట్ బ‌య‌ట ప‌డింది. వివిధ దేశాల‌ను వెంటాడుతోన్న ఈ బీఏ-4 ర‌కం హైద‌రాబాద్ ను తాకింది. క‌రోనా కథ ముగిసిందని భావిస్తోన్న టైంలో ఆందోళన కలిగించే బీఏ-4 వేరిమెంట్ క‌ల‌క‌లం రేపుతోంది. వివిధ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ‘బీఎ-4’ ప్ర‌ధాన కార‌ణం. ఈ నెల 9వ తేదీన ఈ కేసు నమోదైంది. ఈ వేరియంట్‌తో కేసు నమోదు కావడం దేశంలోనే ఇది తొలిసారి.

మరిన్ని నగరాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది. కరోనా బారినపడిన వారికి, టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఇది సోకుతున్నట్టు నిర్ధారణ అయింది. ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకారి కాదు కానీ, వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక విభాగం చీఫ్ మారియా వాన్ పేర్కొన్నారు.

భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే వ్యాపించడం, దీనికితోడు వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా జరగడం వల్ల తాజా వేరియంట్ బీఎ-4 ప్రభావం అంతగా ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కేసులు పెరిగినా ఉద్ధృతి మాత్రం తక్కువగానే ఉంటుందని అంచ‌నా వేస్తున్నారు. బాధితులు ఆసుపత్రుల్లో చేరే పరిస్థితులు దాదాపు ఉండవని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పేర్కొంది. కానీ, వివిధ దేశాల్లోని ప‌రిస్థితుల‌ను చూసిన త‌రువాత హైద‌రాబాద్ లోని బీఏ-4 వేరియెంట్ భ‌యం ద‌డ‌పుట్టిస్తోంది. చైనా, ఉత్త‌ర కొరియా క‌రోనా కొత్త వేరియెంట్ల‌తో అల్లాడిపోతున్నాయి. లాక్ డౌన్ కొన‌సాగిస్తూ ఆయా దేశాలు కంట్రోల్ లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. కానీ, హైద‌రాబాద్ లో ఎలాంటి కోవిడ్ నిబంధ‌న‌లు లేవు . దీంతో బీఏ-4 పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఫ‌లితంగా హైద‌రాబాద్ కు మ‌రోసారి కోవిడ్ ద‌డ మొదల‌యింది.