Site icon HashtagU Telugu

Indian Techie Dead: అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి!

Indian Techie Dead

Indian Techie Dead

Indian Techie Dead: కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఒక భారతీయ టెకీ, మహబూబ్‌నగర్‌కు చెందిన మొహమ్మద్ నిజాముద్దీన్ (30) పోలీసు కాల్పుల్లో (Indian Techie Dead) మరణించాడు. తన రూమ్మేట్‌పై కత్తితో దాడి చేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే తమ కుమారుడిపై జాతి వివక్ష, వేధింపులు ఉన్నాయని కుటుంబం ఆరోపిస్తోంది.

పోలీసుల కథనం

శాంటా క్లారా పోలీసులు సెప్టెంబర్ 3న తమకు ఒక ఇంట్లో కత్తిపోటు ఘటనపై 911 కాల్ వచ్చిందని తెలిపారు. అక్కడ నిజాముద్దీన్ ఒక కత్తితో కనిపించాడని, తన రూమ్మేట్‌పై దాడి చేశాడని పోలీసులు చెప్పారు. నిజాముద్దీన్‌ను నిలువరించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. అనంతరం నిజాముద్దీన్‌ను ఆసుపత్రికి తరలించగా అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కత్తిపోట్లకు గురైన రూమ్మేట్‌కు చికిత్స జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై శాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం, శాంటా క్లారా పోలీస్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి.

Also Read: TikTok: ట్రంప్ టిక్‌టాక్‌ను ఎందుకు పునరుద్ధరించాలని చూస్తున్నారు?

కుటుంబం ఆరోపణలు

నిజాముద్దీన్ కుటుంబం మాత్రం పోలీసుల కథనాన్ని ఖండిస్తోంది. పోలీసులకు ఫోన్ చేసింది నిజాముద్దీనే అని, అతను జాతి వివక్ష, వేతనాల మోసం, ఉద్యోగం నుంచి అన్యాయంగా తొలగించడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పారు. ఈ విషయాలపై నిజాముద్దీన్ తన లింక్డిన్ పోస్టులో కూడా వివరించాడని కుటుంబం పేర్కొంది. ఆ పోస్టులో “జాతి వివక్ష, వేధింపులు, వేతనాల మోసం, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించడం, న్యాయానికి ఆటంకం వంటి వాటికి నేను బాధితుడిని” అని రాసుకున్నాడు.

కుటుంబం ఈ ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తోంది. నిజాముద్దీన్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సహాయం కోరారు. ఎంపీటీ అధికార ప్రతినిధి అంజద్ ఉల్లా ఖాన్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడంలో సహాయం చేయాలని కోరారు.

అమెరికాలో పెరుగుతున్న వేధింపుల కేసులు

అమెరికాలో చదువుకునే లేదా ఉద్యోగం చేసే భారతీయ యువతపై దాడులు, వేధింపులు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు భారతీయ కుటుంబాలలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్యలపై రెండు దేశాల ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నిజాముద్దీన్ మృతిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, నిజాలు వెల్లడి కావాలని అతని కుటుంబం, భారత సమాజం కోరుకుంటోంది.

Exit mobile version