Telangana Exit Polls 2023 : ఎటూ తేల్చని ఎగ్జిట్ పోల్స్

ఆఖరి ఘట్టంగా పోలింగ్ తెలంగాణ (Telangana)లో ముగిసిన వెంటనే పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేశాయి.

  • Written By:
  • Publish Date - December 1, 2023 / 10:34 AM IST

By: డా. ప్రసాదమూర్తి

Telangana Exit Polls 2023 : ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి. ఎన్నికల ముందు పలు సంస్థలు పలు సర్వేలు నిర్వహించాయి. ఐదు రాష్ట్రాల్లో మిజోరాం మినహా మిగిలిన నాలుగు చోట్ల సర్వేల అంచనాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆఖరి ఘట్టంగా పోలింగ్ తెలంగాణ (Telangana)లో ముగిసిన వెంటనే పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేశాయి. వీటిలో ఆశ్చర్యంగా ప్రీపోల్ సర్వేలకి, ఎగ్జిట్ పోల్ అంచనాలకి ఫలితాలు తారుమారైన చిత్రం కనిపిస్తుంది. చత్తీస్గఢ్లో కాంగ్రెస్ విజయం నల్లేరుపై బండి నడకగా ఉంటుందని భూపేష్ బఘేల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ప్రీ పోల్ సర్వేలు చెప్తే, ఎగ్జిట్ పోల్స్ మాత్రం చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీకి స్వల్ప మెజారిటీ మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నాయి. కాగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించవచ్చునని, అక్కడ అధికారంలో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఘోరంగా ఓడిపోయే అవకాశాలు ఉన్నట్టు ప్రీ పోల్ సర్వేలు అన్నీ చెప్పాయి.

We’re Now on WhatsApp. Click to Join.

కానీ విచిత్రంగా ఎగ్జిట్ పోల్స్ మాత్రం దాదాపు అన్నీ మధ్యప్రదేశ్లో బిజెపి ఇంచుమించు స్వీప్ చేస్తుందని చెప్తున్నాయి. అంటే మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో అంత వ్యతిరేకత లేదని ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎంపీలో అధికారాన్ని కైవసం చేసుకుంటుందని సాగిన సర్వే సంస్థల అంచనాలన్నీ ఇక్కడ తల్లకిందులైనట్టుగా కనిపిస్తోంది. కాగా రాజస్థాన్లో చాలా సర్వే సంస్థలు ఫైట్ కాంగ్రెస్ పార్టీ బిజెపి మధ్య చాలా తీవ్రంగా ఉంటుందని, కాస్త ఎడ్జ్ తో అక్కడ బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తుంది.

కాంగ్రెస్ ముఖ్యమంత్రి గెహ్లోట్ అత్యధిక ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా ప్రతి సర్వే సంస్థ లోనూ తేలినప్పటికీ, రాజస్థాన్లో సంప్రదాయంగా కొనసాగుతున్న ప్రభుత్వ మార్పిడి అనేది ఈసారి కూడా పునరావృతం అవుతున్నట్టు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కానీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ రాజస్థాన్లో కాంగ్రెస్ కి అవకాశం ఉన్నట్టు కూడా చెబుతున్నాయి. అందుకే ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఎటూ తేల్చ లేదనే అభిప్రాయం అర్థమవుతుంది.

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ హవా..

తెలంగాణ (Telangana)లో ప్రీపోల్ సర్వేలు చాలా వరకు కాంగ్రెస్కు ఆధిక్యత ఉంటుందని చెప్పాయి. అదే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఖరారు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ మూడో తేదీ ఫైనల్ ఫలితాల ప్రకటన తర్వాత కానీ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. చాలా ఎగ్జిట్ పోల్ సంస్థలు కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించవచ్చు అని చెబుతున్నాయి. కొన్ని కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెబుతున్నాయి. ఎక్కువ శాతం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణ (Telangana)లో ఇప్పుడు ఎక్కువగా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఇక్కడ హార్స్ ట్రేడింగ్ జోరుగా సాగుతుంది. అసలే ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రెండు రాత్రులు, ఒక పగలు, కోట్ల రూపాయల పంపిణీ జరిగినట్లు వార్తలు వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే అది హార్స్ ట్రేడింగ్ కి దారి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నట్టుగా తమకు 80 సీట్లు వస్తే తప్ప వారు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే స్థితిలో చాలా తీవ్రమైన ఒత్తిడికి ప్రమాదానికి గురి కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ స్పష్టమైన మెజారిటీ ఇస్తారని ఆ పార్టీ నాయకత్వం చెప్తోంది.

మరోపక్క ఎగ్జిట్ పోల్స్ గతంలో చాలా చూశామని తమకు 70 సీట్లు ఖాయమని కేటీఆర్ ప్రకటించారు. ఎవరి ధీమా ఎలా ఉన్నా అనేక సర్వేలు చెప్పినట్టు అధికార బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ మాత్రం వచ్చే అవకాశం కనిపించడం లేదు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోతే ఇక లెక్కలు తారుమారయ్యే అవకాశం చాలా ఉంది. ఇక్కడ బిజెపికి సీట్లు సింగిల్ డిజిట్ లో ఉంటాయా డబల్ డిజిట్లో ఉంటాయా అనేది కీలకం. బిజెపికి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే బీఆర్ఎస్ కు అంత మేలు జరిగే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో ఎంఐఎంకు సాంప్రదాయంగా వచ్చే సీట్ల కంటే ఒకటి రెండు తగ్గే అవకాశాలు కూడా ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ ద్వారా అర్థమవుతుంది.

ఏది ఏమైనా కాంగ్రెస్ కి స్పష్టమైన మెజారిటీ రాకపోతే అటు బిజెపి ప్రత్యక్షంగా, ఎంఐఎం పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి అటూ ఇటూ అండగా నిలిచే అవకాశాలు ఎక్కువ. ఇక ఇప్పుడు ప్రజలు, ప్రజాస్వామ్యం, విలువలు.. ఏవీ ఎక్కడా చర్చకు రావు. కేవలం ఎన్నికైన ఎమ్మెల్యేలలో ఎవరిని ఎవరి వైపు ఎలా లాగాలన్న ప్రయత్నాలలో ఎవరి బలాబలాలు వాళ్ళు నిరూపించుకుంటారు. కాంగ్రెస్ ఎలా జాగ్రత్త పడుతుందో వేచి చూడాల్సిందే.

Also Read:  Polling ended peacefully in Telangana : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. చివరి ఓటింగ్ శాతం ఇదే?