గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఓటరు పై కాసుల వర్షం

యాదాద్రి భువనగిరి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారాయి. చౌటుప్పల్ మండలంలోని కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు ఓటర్లకు రూ. 10,000 నుండి రూ. 30,000 వరకు నగదు పంపిణీ చేశారు. పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కారణంగా సర్పంచ్ పదవులకు భారీ పోటీ నెలకొంది. మద్యం, విందు రాజకీయాలు కూడా జోరుగా సాగాయి. పల్లె పోరులో కాసుల వర్షం చౌటుప్పల్ మండలంలో రికార్డు స్థాయి ‘ఓటు’ రేటు ఒక్కో ఓటుకు రూ. 30 వేలు యాదాద్రి […]

Published By: HashtagU Telugu Desk
Cash For Votes

Cash For Votes

యాదాద్రి భువనగిరి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారాయి. చౌటుప్పల్ మండలంలోని కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు ఓటర్లకు రూ. 10,000 నుండి రూ. 30,000 వరకు నగదు పంపిణీ చేశారు. పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కారణంగా సర్పంచ్ పదవులకు భారీ పోటీ నెలకొంది. మద్యం, విందు రాజకీయాలు కూడా జోరుగా సాగాయి.

  • పల్లె పోరులో కాసుల వర్షం
  • చౌటుప్పల్ మండలంలో రికార్డు స్థాయి ‘ఓటు’ రేటు
  • ఒక్కో ఓటుకు రూ. 30 వేలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఖరీదైనవిగా మారాయి. ముఖ్యంగా చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్‌పేట, దండుమల్కాపురం, ఆరెగూడెం వంటి గ్రామాల్లో అభ్యర్థులు ఓటర్లపై నోట్ల వర్షం కురిపించారు. బుధవారం తెల్లవారుజాము నుంచే మొదలైన ఈ నగదు పంపిణీ.. పోలింగ్ ముగిసే వరకు నిర్విఘ్నంగా కొనసాగింది. ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేస్తూ.. అభ్యర్థులు ఓటును వేలం పాట స్థాయికి తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఈ గ్రామాలు హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి వెంటే ఉండటం, పారిశ్రామికంగా, రియల్ ఎస్టేట్ పరంగా వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో.. ఇక్కడి సర్పంచ్ పదవుల కోసం స్థిరాస్తి వ్యాపారులు భారీగా పోటీ పడ్డారు. ప్రతిష్ఠాత్మక పోరులో గెలుపే లక్ష్యంగా ఒక్కో అభ్యర్థి ఓటుకు రూ. 15,000 వరకు ఇవ్వగా, ప్రత్యర్థి అభ్యర్థులు కూడా తక్కువ కాకుండా రూ. 10 నుంచి రూ. 15 వేల వరకు పంపిణీ చేశారు. దీనివల్ల రెండు వైపుల నుంచి నగదు అందుకున్న ఓటర్లకు ఒక్కో ఓటుపై ఏకంగా రూ. 25,000 నుండి 30,000 వరకు అందినట్లు సమాచారం. ఆరెగూడెం వంటి గ్రామాల్లో వార్డు సభ్యుల అభ్యర్థులు సైతం రూ. 5,000 నుంచి 10,000 వరకు వెచ్చించడం గమనార్హం.

కేవలం విడి ఓట్లకే కాకుండా.. ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువ ఓట్లు ఉన్న వారికి అభ్యర్థులు ప్రత్యేక ప్యాకేజీలను ఆఫర్ చేశారు. ఐదు నుంచి ఆరు ఓట్లు ఉన్న కుటుంబాలకు రూ. 20,000 నుంచి 50,000 వరకు ఒకేసారి ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. మండలంలోని ఇతర గ్రామాల్లో ఓటు ధర సగటున రూ. 3 వేల నుంచి 5 వేల వరకు ఉండగా.. పారిశ్రామిక ప్రాంతమైన తూప్రాన్‌పేట బెల్ట్‌లో ఈ రేటు ఆకాశాన్ని తాకింది. మద్యం ఏరులై పారడంతో పాటు, విందు రాజకీయాలు కూడా ఈ విడతలో పతాక స్థాయికి చేరాయి.

సాధారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగినప్పటికీ.. రాజకీయ ఆధిపత్యం కోసం అభ్యర్థులు తమ శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు. ఇలా నగదు ప్రలోభాలకు గురి చేయడం వల్ల సామాన్యులు, నిజాయితీ గల అభ్యర్థులు పోటీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించినప్పటికీ.. గ్రామాల్లోని అంతర్గత వీధుల్లో రహస్యంగా సాగిన ఈ పంపిణీని అడ్డుకోవడం అధికారులకు సవాలుగా మారింది.

  Last Updated: 18 Dec 2025, 09:02 AM IST